29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేంద్ర అధ్యక్షులు రామానంద రాయ్ గౌరదాస్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం ఆధ్వర్యంలో నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కేంద్ర అధ్యక్షులు రామానంద రాయ్ గౌరదాస్ తెలిపారు. గురువారం కంఠేశ్వర్ కేంద్రంలో నిర్వహించిన రథయాత్ర సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూరి జగన్నాథ క్షేత్రంలో నిర్వహించే రథయాత్రను ఆదర్శంగా తీసుకుని, మధ్యాహ్నం 2 గంటలకు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభమయ్యే ఈ రథయాత్ర, రైల్వే కమాన్, గణేష్ చౌక్, రైల్వే స్టేషన్, బస్టాండ్, గాంధీ చౌక్, పెద్ద బజార్, శివాజీ చౌక్, పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మగుట్ట కమాన్, కోర్టు చౌరస్తా, రైల్వే అండర్ బ్రిడ్జి మీదుగా సాయంత్రం 7 గంటలకు ఆర్మూర్ రోడ్డులోని శ్రీరామ గార్డెన్‌కు చేరుకుంటుందని తెలిపారు. శ్రీరామ గార్డెన్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, సంకీర్తనలు, శ్రీ జగన్నాథ స్వామివారికి అభిషేకం, చప్పన్ భోగ్ నివేదనతో పాటు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్నాయి. రథయాత్రలో మహిళలు, పురుషులు, యువత, చిన్నారులు, వృద్ధులు సహా జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగి భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కావాలని ఇస్కాన్ ప్రతినిధులు కోరారు. పురాణాల ప్రకారం జగన్నాథ స్వామివారి రథాన్ని దర్శించడం, రథాన్ని లాగడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని, జన్మజన్మాంతర పాపాలు పరిహారమై భగవంతుని కృప సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ఇందూరు నగరంలో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని రథయాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. సన్నాహక సమావేశంలో ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రం అధ్యక్షులు రామానంద రాయ్ గౌరదాస్‌తో పాటు గంగారెడ్డి ప్రభు, మాదాసు స్వామి యాదవ్, రఘుపతి, రాధ రాజా గోపికేశ దాస్, బలరాం ప్రభు, సునీల్ ప్రభు, రోహిత్ ప్రభు, నవరూప ముకుంద దాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article