. . . జిల్లా నాయకురాలు సత్తెమ్మ డిమాండ్
ఏర్గట్ల, బతుకమ్మ :
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు సత్తెమ్మ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం ఏర్గట్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీఓ వెంకటేశ్వర్లకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సత్తెమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామపంచాయతీ కార్మికులకు ప్రకటించిన వేతనాలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి పీఎఫ్, ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గ్రామపంచాయతీల్లో కార్మికుల సంఖ్యను పెంచాలని, పని భారం తగ్గించాలని ఆమె కోరారు. మల్టీపర్పస్ విధానానికి సంబంధించిన 51 జీవోను రద్దు చేయాలని, కారోబార్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే గ్రామపంచాయతీ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ.5 లక్షలు, విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల గ్రాట్యూటీ అందించాలని సత్తెమ్మ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దయల్ సింగ్, ఏర్గట్ల మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు, మహిళా కార్మికులు పాల్గొన్నారు.
