27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

Must read

📰 Generate e-Paper Clip

  • 3న ఎన్నికల షెడ్యూల్
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
  • స్వతంత్రుల పోటీపై సంశయాలు
  • బీఆర్ఎస్ పోటీపై కొనసాగుతున్న సందిగ్ధత

నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణలో ఖాళీ అయిన మూడు శాసనమండలి సభ్యుల ఎన్నికలకు వేళ అయింది. ఈ నెల 3 నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఆ రోజు నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి రానుంది. కరీంనగర్ స్థానం నుంచి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ కాగా వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ పోస్టుకు ఎన్నికలు జరుగనున్నాయి. గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెల్సిందే. ఇప్పటికే ఓటర్ల తుది జాబితా ఖరారు అయిన విషయం విధితమే. కరీంనగర్ శాసనమండలి స్థానం పరిధిలోకి ఆదిలాబాద్,మెదక్, నిజామాబాద్ జిల్లాలు వస్తాయి. గడిచిన శాసనమండలి ఎన్నకల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలువగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూర రఘోత్తంరెడ్డి గెలుపొందిన విషయం తెల్సిందే. జీవన్ రెడ్డి ఈసారి పోటీకి దూరం కాగా రఘోత్తంరెడ్డి ఏకంగా ఉపాధ్యాయ సంఘాన్ని మార్చి పోటీ చేస్తున్నారు.
శాసనమండలి ఎన్నికలు ఈసారి రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధానంగా పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ ఎక్కువగా ఉంది. ఇది వరకే ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ కు ముందుగానే అభ్యర్థులు రంగంలోకి దిగి ప్రచారాన్ని ప్రారంభించారు. కొందరు అభ్యర్థులు ఓటర్ల నమోదులోనూ కీలకంగా పని చేశారు. ప్రధానంగా విద్యాసంస్థల అధినేతలు, ట్రస్మా ప్రతినిధులు పోటీ చేస్తామని గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేసుకునే పనిలో పడ్డారు. పీఆర్ టీయూ నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగ మహేంధర్ రెడ్డిని ప్రకటించగా ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిని ప్రచారంతో చుట్టేశారు. ఇప్పటి వరకు ముందుగా బీజేపీ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ముందుగా ప్రకటించి రంగంలోకి దిగింది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా గెలుచుకోవాలని కసరత్తు చేస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సంగారెడ్డికి చెందిన అంజిరెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెద్దపల్లి జిల్లాకు చెందిన కొమురయ్యను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా కరీంనగర్ జిల్లాకు చెందిన అల్పోర్స్ సంస్థల అధినేత డా. నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది.
ఇప్పటి వరకు పోటీ కోసం తహతహలాడిన గ్రాడ్యుయేట్ లలో ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారని చెప్పాలి. కాంగ్రెస్ తరపున ప్రసన్నహరికృష్ణ టికెట్ ను ఆశించారు. అదే సమయంలో బీఆర్ఎస్ ఇప్పటి వరకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం పోటీపై సందిగ్ధం నెలకొంది. స్వతంత్రులుగానే రంగంలోకి దిగిన మాజీ డీఎస్పీ మధనం గంగాధర్, రాజారాం యాదవ్ బరిలో ఉంటామని ప్రచారం చేస్తున్నారు. పాత నాలుగు ఉమ్మడి జిల్లాలోని 42 నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ల ఓట్లను దక్కించుకోవడం ఆషామాషీ కాదు. ఇప్పటి వరకు బీఆర్ ఎస్ పోటీపై ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో గణనీయమైన ఓటు బ్యాంక్ బలంగా ఉందని చెప్పాలి. అధికార పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో పాటు ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి ప్రజల్లోనూ స్పందన రావడం కలవరపెడుతుంది. అదీగాకా అధికార పార్టీకి గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయరన్న సాంప్రదాయం ఉంది. ఇప్పటికే బీజేపీ చాపకింద నీరులా ప్రచారం చేస్తుండడం, నలుగురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల్లో మాజీలు ఉండడం వారు బలంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక విధంగా పోటీ ఉంటే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరొక విధంగా ఉండనుంది. అతితక్కువగా ఉన్న ఉపాధ్యాయ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధానంగా పీఆర్ టీయూ, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు మధ్య పోటీ నువ్వానేనా అన్న రీతిలో సాగడం ఖాయంగా ఉంది.

More articles

Latest article