24.7 C
Hyderabad

పీఆర్సీ అమలుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీపీటీఎఫ్ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చినా, మూడు సంవత్సరాలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీపీటీఎఫ్ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ విమర్శించారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) పిలుపు మేరకు దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం శంకర్ భవన్ పాఠశాలలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. పాఠశాల విరామ సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీపీటీఎఫ్ అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై పీఆర్సీ ప్రకటించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. యూఎస్‌పీసీ రూపొందించిన నాలుగు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12, 13 తేదీల్లో ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట ప్రదర్శనలు నిర్వహించి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే నెల శాసనసభ సమావేశాల సందర్భంగా “చలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రభుత్వం ముందు 13 ప్రధాన డిమాండ్లను ఉంచింది. వాటిలో తక్షణమే పీఆర్సీ ప్రకటించడం, పెండింగ్ డీఏల విడుదల, ఈ నెల 15లోగా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయడం, విద్యా రంగానికి 15 శాతం నిధులు కేటాయించడం, జీవో 25 సవరణ, సర్వీస్ రూల్స్ సమస్యల పరిష్కారం, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపు, కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులకు కనీస వేతనాలు, జీవో 317 బాధితులకు న్యాయం, టెట్‌లో సర్వీస్ వెయిటేజ్, మోడల్, ఎయిడెడ్ పాఠశాలలను విద్యాశాఖలో విలీనం, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్, హెల్త్ కార్డుల పూర్తి స్థాయి అమలు వంటి అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ డిప్యూటీ అధ్యక్షుడు బి. మల్లేశం, కార్యదర్శి గోపి, ప్రధానోపాధ్యాయుడు సాయన్న, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రామచంద్రతో పాటు శ్రీహరిరావు, శైలేష్, రాజయ్య, దామోదర్, రాజేంద్ర ప్రసాద్, శ్రీనివాస్ రాజు, రాములు, గంగాధర్, శ్రీలక్ష్మి, సునీత, రజిని, మాధవి, శాంతాబాయి, స్వర్ణలత, విజయలక్ష్మి, శోభ, పావని, దయానంద్, నందిని, సంతోష్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article