- బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్
మోర్తాడ్ బతుకమ్మ: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కొరకు ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తుందని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం మోర్తార్ లోని ప్రజా నిర్ణయం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని గ్రామ గ్రామాన పేద ప్రజల ఇండ్లలో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో అతి తక్కువ రేటుకి ఇసుకను అందుబాటులో ఉంచామని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుకను అందిస్తుందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నేరుగా మండల రెవెన్యూ అధికారిని సంప్రదించి ఉచిత వేబిల్స్ తీసుకోవాలని ప్రతీ మంగళవారం ప్రభుత్వ ఇసుక పాయింట్ వద్ద లబ్ధిదారులు కేవలం ట్రాక్టర్ కిరాయి లేబర్ కిరాయి మాత్రమే పెట్టుకుని ఇసుకను తరలించుకోవాలని ఆయన తెలిపారు. ఇసుక విషయంలో ప్రజలను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని అక్రమంగా అధిక ధరకు అమ్మితే ట్రాక్టర్ లను అధికారులు సీజ్ చేస్తారని అన్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందిస్తూ పేద ప్రజల ఇంట్లో వెలుగులు నింపుతుందని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ తో పాటు సీఎంఆర్ ఎఫ్ అర్హులైన ప్రజలందరికీ అతి త్వరగా అందుతున్నాయని అన్నారు. అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని పేద ప్రజలు గ్రామాలలోని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను సంప్రదించాలని వారు అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తారని తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే ఖరీఫ్ సీజన్ రైతు భరోసా పెట్టుబడి సాయం ప్రతి రైతు ఖాతాలో పడిందని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో దాన్యం ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కోనుగోలు చేసింది ధాన్యం తాలూకు డబ్బులు 5 నుండి వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లోనె జమ అయ్యాయి. బోనస్ డబ్బులు త్వరలోనే అందుతాయన్నారు. ప్రతీ రోజూ పేదవారి ఇంట్లో పండగా ఉండాలని ప్రతి బిడ్డా సన్నబియ్యం తినాలని ముఖ్యమంత్రిగారు ఆలోచించి రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు. ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఇది ప్రజా ప్రభుత్వమని ఆయన అన్నారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అధ్యక్షులు, కిసాన్ కాంగ్రెస్,సేవాదళ్,ఎన్ఎస్యూఐ కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
