. . . జిల్లాలో 55 బ్లాక్ స్పాట్ లను సందర్శించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య
ఎడపల్లి, బతుకమ్మ :
ప్రమాదాల నివారణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, జిల్లాలో ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా సమగ్ర చర్యలు కొనసాగుతున్నాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గల 55 బ్లాక్ స్పాట్లను పోలీసులు శనివారం గుర్తించి పర్యవేక్షించారు. ఎస్సైలు, సీఐలు, ఏసీపీలు, అదనపు డీసీపీ (అడ్మిన్)తో పాటు పోలీస్ కమిషనర్ స్వయంగా ఈ ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రమాదాలకు ప్రధాన కారణాలైన అధిక వేగం, రోడ్డు వంపులు, స్పష్టమైన సూచిక బోర్డుల లేమి, రాత్రివేళలలో తగిన లైటింగ్ లేకపోవడం వంటి అంశాలను గుర్తించారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ స్పాట్లలో తక్షణ చర్యలుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, ఫ్లోరోసెంట్ పెయింటింగ్, రేడియం స్టిక్కర్ తో కూడినటువంటి పోలీస్ కటౌట్ ల ఏర్పాటు, స్పీడ్ బ్రేకర్లు నిర్మించడం, రోడ్డు మార్కింగ్‌లు స్పష్టంగా వేయడం, స్ట్రీట్ లైటింగ్ మెరుగుపరచడం వంటి పనులు చేపట్టాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణను పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
