. . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగర ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వేగవంతమైన పరిష్కారాలు అందించాలనేదే తమ లక్ష్యమని నగర మేయర్ కూరగాయల ఉమారాణి అన్నారు. బుధవారం నగరంలోని 59, 10, 21 డివిజన్లలో నగర మేయర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా పారదర్శకమైన, ప్రజా కేంద్రిత పాలనను అందించాలనే సంకల్పంతో నిర్వహించిన ఈ పర్యటనకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా ఆయా డివిజన్లలోని కాలనీలు, ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, డ్రైనేజీ కాలువలు, తాగునీటి సరఫరా వ్యవస్థలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల పరిస్థితి తదితర అంశాలను మేయర్, కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతాల్లో నెలకొన్న వివిధ సమస్యలను వారి దృష్టికి తీసుకురాగా, వాటిని శ్రద్ధగా విన్న అధికారులు సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేకంగా తాగునీటి సరఫరాలో అంతరాయాలు, డ్రైనేజీ సమస్యలు, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలు వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రతి సమస్యను నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అనంతరం ఆయా డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్, కమిషనర్ పనుల నాణ్యత, పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను కార్యాలయాల్లో కూర్చొని తెలుసుకోవడం కంటే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా వేగవంతమైన పరిష్కారాలు అందించడం సాధ్యమవుతుందని అన్నారు. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం నగర పాలక సంస్థ నిరంతరం కృషి చేస్తోందని, ప్రతి డివిజన్‌ను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. ఈ పర్యటనలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
