హైదరాబాద్, బతుకమ్మ : సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో కాళోజీ నారాయణ రావు, చాకలి ఐలమ్మ ల చిత్రపటాలకు కవిత నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజలను కదలించిన కవి కాళోజీ అని అన్నారు. పుట్టుక నీది, చావు నీది బతుకంతా తెలంగాణది అని ఆయన మనలో స్ఫూర్తి నింపారని అన్నారు. కవికి మరణం ఉండదని, కాళోజీ అనుసరించిన విలువలు, కవిత్వం ఇప్పటికీ ఆయనను గుర్తు చేసుకునేలా చేస్తాయన్నారు. ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని, అలాంటి వీరత్వం తెలంగాణ రక్తంలోనే ఉందన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి తో మనం ముందుకు కదలాలి అన్నారు. నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం కూలిపోయిందని సీఎం విమర్శించడని, అదే ప్రాజెక్ట్ లో భాగమైన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్ కు నిన్న ఎలా శంకుస్థాపన చేశారని విమర్శించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెస్తే రూ. 1500 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయన్నారు. దీంతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చవచ్చన్నారు. మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామంటూ రూ. 7500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, మేఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టేందుకు రేవంత్ సహకరిస్తున్నారని ఆరోపించారు. రూ. 1500 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు 7500 కోట్లకు చేరిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి ఉన్నత మైన లక్ష్యంతో ముందు అడుగు వేయాలని నిర్ణయించుకుందాన్నారు. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి విశ్రమించదన్నారు. సామాజిక తెలంగాణ కోసం లెప్ట్ టు రైట్ అందరినీ కలుస్తామన్నారు. మూడో సారి గెలిస్తే కేసీఆర్ సామాజిక తెలంగాణ చేసే వారని అన్నారు. వారి అజెండాను మేము ముందుకు తీసుకెళ్తామన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంచుకున్న మార్గాన్నేసామాజిక తెలంగాణ కోసం మేము ఎంచుకుంటామన్నారు. తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవాలని, పార్టీలకు అతీతంగా ఆయనకు మద్దతు తెలపాలని కోరారు. ఎన్నికల కమిషనర్ గా శేషన్ ఏ విధంగా పదవికి వన్నె తెచ్చారో…సుదర్శన్ రెడ్డి కూడా ఉపరాష్ట్రపతి పదవికి అలా వన్నె తెస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

