ఆర్టిజన్ ఆడిందే ఆట

0 1,281

. విధులకు వెళ్లేది లేదు.. జీతం తీసుకోకుండా ఆగేది లేదు

నిజామాబాద్, బతుకమ్మ:  విద్యుత్ శాఖలో నిజామాబాద్ డివిజన్ స్థాయి అధికారికి ప్రీతిపాత్రుడైన ఆర్టిజన్ ఆడిండే ఆటగా మారింది. విధులకు యథేచ్ఛగా డుమ్మా కొడుతున్న తను టైంకి మాత్రం జీతం తీసుకుంటున్నాడు. సదరు ఆర్టిజన్ వ్యవహారం పవర్ హౌస్ లో చర్చనీయాంశమైంది. అనుమతి లేకుండా డిప్యూటేషన్ లు వేయొద్దని ఎన్పీడీసీఎల్ సీఎండి ఆదేశించారు. అయితే ఆయన ఆదేశాలను కాదని ఒక్కడి కోసం  2023లో నిజామాబాద్ డివిజన్ కు వచ్చేందుకు ఉత్తర్వులు తీశారు. దీంతో ఒక్కొక్కరు పవర్ కాంపౌండ్ లోకి నోటిమాటగా చెప్పించుకొని రావడం మొదలెట్టారు. అక్రమ డిప్యుటేషన్ ల వ్యవహారాన్ని ‘బతుకమ్మ’ వెలుగులోకి తీసుకురావడంతో వ్యవహారం ముదురుతోందని గ్రహించిన డివిజన్ స్థాయి అధికారి డిప్యుటేషన్లను రద్దు చేశారు.

ఆర్టిజన్ కు వర్తించదా..?

సబ్ డివిజన్ లోని పోస్టింగ్ ఉన్న ఆర్టిజన్ పవర్ హౌస్ లోని డివిజన్ కార్యాలయం పరిధిలో చకోర పక్షిలా తిరుగుతున్నాడని కాంపౌండ్ సిబ్బంది అంటున్నారు. డిప్యుటేషన్ల రద్దు తరువాత ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్లాలని కొందరికి మౌఖికంగా, ఇంకొందరికి రాత పూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ తరువాత అంతా ఎవరికి స్థానాలకు వాళ్లు వెళ్లిపోయినప్పటికీ సదరు ఆర్టిజన్ మాత్రం డివిజన్ కార్యాలయం పరిసరాలలో పచార్లు కొడుతున్నాడనే ప్రచారం జరుగుతోంది.  పై స్థాయి అధికారుల అండదండలు ఉండడం వల్లే విధులకు వెళ్ళట్లేదని, ఆయనను అడిగేవారే లేకుండాపోయారని అంటున్నారు.

నోటిమాటగా చెప్పించుకుని..

ఈ మధ్యే ఒక మందిరానికి సంఘ నాయకుడితో కలిసి వెళ్లి స్టేటస్ పెట్టుకున్నాడు. దీనిని పసిగట్టిన వారు, పై అధికారి అనుమతి తీసుకొని వెళ్ళాడా? లేదా? అని కొందరు ఆరా తీశారు. ఆర్టిజన్ తో పని ఉంది పంపించాలని డివిజన్ స్థాయి అధికారి మౌఖికంగా చెప్పడంతో, వారం రోజుల నుంచి నందిపేట్ రావడం లేదని ఓ అధికారి పేర్కొన్నట్లు తెలిసింది. 

ఆ అధికారికి ప్రీతిపాత్రుడు

డివిజన్ లో పని ఉందని నందిపేట్ నుంచి ఆర్టిజన్ ను పిలిపించుకోవడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. తప్పనిసరైతే పవర్ హౌస్ లోనే చాలా మంది నేర్పరి గల కంప్యూటర్ ఆపరేటర్ లు ఉన్నారని పేర్కొంటున్నారు. డివిజన్ లో ఆరు సబ్ డివిజన్ లు ఉండగా, నందిపేట్ లో కంప్యూటర్ ఆపరేటర్ లేకపోవడంతో  పనులు నెమ్మదిస్తున్నాయని అందులోని సిబ్బంది తరచుగా సహచరులతో చెప్పుకుంటున్నట్లు సమాచారం. డిప్యూటేషన్లో ఉన్నవారిని పంపించి, ఒక్కరికి చేయూతను అందించడం సిబ్బంది పట్ల పక్షపాత ధోరణేనని, ఇది అధికారులకు తగదనే మాటలు వినిపిస్తున్నాయి.

సీఎండీ దృష్టికి..

ఈ వ్యవహారాన్ని ఇలాగే  కొనసాగించినట్లయితే కంపెనీ సీఎండి దృష్టికి తీసుకెళ్లేందుకు కాంపౌండ్ లోని ఉద్యోగులు సమాయత్తం అవుతున్నట్లు తెలిసింది. మౌఖిక ఆదేశాలతో ఉన్న వారిని వారి యథాస్థానానికి పంపించిన డివిజన్ స్థాయి అధికారి, ఇంకొకరికి మద్దతు తెలపడం అంతర్గతంగా వివాదాలకు దారి చూపడమేనని ఆయా యూనియన్ ల నాయకులు, సభ్యులు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.