. . . ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
ఇందల్వాయి, బతుకమ్మ :
గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. రేకులపల్లి భూపతి రెడ్డి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇందల్వాయి గ్రామ అభివృద్ధి పనుల కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్డిఎఫ్) కింద మంజూరైన రూ.23 లక్షల విలువైన ప్రొసీడింగ్ పత్రాలను శనివారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ నేతృత్వంలో గ్రామ సర్పంచ్ లోకాని గంగామణి గంగారం, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ రియాజ్, కమిటీ సభ్యులు ఈ పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందల్వాయి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామంలోని అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, రెండో విడతలో మరిన్ని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్‌డీఎఫ్ నిధుల కింద వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ముదిరాజ్ సంఘం అభివృద్ధికి రూ.5 లక్షలు, కుమ్మరి సంఘం అభివృద్ధికి రూ.5 లక్షలు, ఇందల్వాయి శ్రీ రామాలయం ప్రాంగణంలో కాంపౌండ్ వాల్, ఫ్లోరింగ్ నిర్మాణానికి రూ.10 లక్షలు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేవాలయాలు, సామాజిక భవనాల నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రజల సహకారంతో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు, సభ్యులు, ముదిరాజ్, కుమ్మరి సంఘాల నాయకులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

