27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతులకు వెన్నుపోటు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎస్కేఎం జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 14 రకాల పంటలకు నామమాత్రంగా మాత్రమే మద్దతు ధరలు పెంచి రైతులను మోసం చేసిందని ఎస్ కెఎం జిల్లా కన్వీనర్ వేల్పూర్ భూమయ్య ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఎస్‌కేఎం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ చౌరస్తాలో పంటల ధరల పెంపు జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భూమయ్యతో పాటు నాయకులు పి. వెంకటేశ్, బి. బాబన్న మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని విమర్శించారు. వరి క్వింటాలకు కేవలం రూ.72, మొక్కజొన్నకు రూ.10, పెసర్లకు రూ.12 మాత్రమే పెంచడం రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మరోవైపు కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ.300 నుంచి రూ.400 వరకు ధరలు పెంచి రైతులపై అదనపు భారం మోపిందని ఆరోపించారు. క్రిమిసంహారక మందుల ధరలు కూడా భారీగా పెంచి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుస్తోందని అన్నారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటల ఉత్పత్తి వ్యయానికి (సి2) అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధరలు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు వ్యతిరేక చట్టాల వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతోందని నాయకులు విమర్శించారు. రైతులు అప్పుల పాలై వ్యవసాయం కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఎంఎస్ పి గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని, విత్తన మరియు విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి హామీ చట్టంలో తీసుకొచ్చిన కొత్త జిరాంజీ నిబంధనలను రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఎం, రైతు సంఘాల నాయకులు బి. దేవరం, పెద్ది వెంకట్రాములు, డిశేటి సాయరెడ్డి, కె. గంగాధర్, ర్యాపని గంగాధర్, కిషన్, వి. గంగారాం, పోషన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

 

The central government is turning a blind eye to farmers.

More articles

Latest article