- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
పెద్దపల్లి, బతుకమ్మ : తట్టా, చెమ్మాస్ కింద పడేస్తామని నాడు సింగరేణి కార్మికులు చేసిన హెచ్చరికతో తెలంగాణా ఇచ్చే ఆలోచనతో నాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 160 నుంచి 170 పార్టీలు వచ్చి పోయినై. కానీ, 25 ఏళ్లుగా బీఆర్ఎస్ తెలంగాణా ప్రజల గుండె చప్పుడైందన్నారు. తెలంగాణా ప్రజలతో బీఆర్ఎస్ ది పేగుబంధం అని తెలిపారు. ప్రతీ ఏటా ప్లీనరీలు జరుపుకుంటున్నా, ఈ రజోతత్సవ సభ ప్రత్యేకమైందని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా జరిగిన ఉద్యమ, బీఆర్ఎస్ పాలనా కాలాన్ని ఓసారి ప్రజలంతా నెమరువేసుకునేలా ఈ సభ ఉండబోతోందని తెలిపారు. బీఆర్ఎస్ అస్తిత్వాన్ని ఒకపక్క కాపాడుకుంటూనే.. ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులు, పైఎత్తులనూ మనం పరశీలిస్తూ ముందుకెళ్లాల్సి ఉందన్నారు. వాటిని ప్రజల ముందు ఎండగట్టాలన్నారు. రైతుబంధును నీరుగార్చి రైతులకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. అకాలవర్షాలకు ధాన్యం నాని, మామిడి రాలి రైతులు నష్టబోతుంటే ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు వారిని ఆదుకుంటామని ఒక్క ప్రకటన ఎందుకు చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులకు నష్టం వాటిల్లితే మేం వెళ్లలేదా.. ? మీరు ఎందుకు పరిశీలించడం లేదు..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన 80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్స్ లోంచి 50 వేల ఉద్యోగాలిచ్చి మేమేదో కొత్తగా చేశామన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారన్నారు. ఉద్యమకాలం నుంచి తెలంగాణా వచ్చాక కూడా జై తెలంగాణా అనని ముఖ్యమంత్రి ఉండటం, మంత్రివర్గముండటం మన దురదృష్టం అని అన్నారు. జై సోనియమ్మ అనుడే తప్ప జై తెలంగాణా వాళ్ల నోళ్లల్లోంచి రాదని, అది రానంతసేపు వారు తెలంగాణా గురించి ఆలోచించరని అన్నారు. భట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణిని కేంద్రం కాళ్ల ముందు పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణాలో బీజేపీ, కాంగ్రెస్ ను చూసినప్పుడు ఏదేమైనా ఇంటిపనికైనా ఒంటిపనికైనా మనోడుండాలనిపిస్తోందని అన్నారు. అంతకు ముందు పహల్గాం టెర్రర్ అటాక్ లో మృతి చెందినవారికి పెద్దపెల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ నాయకులు రెండు నిమిషాల మౌనం పాటించి నివాళులర్పించారు.
