. . . పిఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బోధన్ ప్రాంతంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బోధన్ డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని తక్షణమే పునఃప్రారంభించాలని పిఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. ప్రస్తుతం బోధన్‌లో డిప్యూటీ ఈవో కార్యాలయం అందుబాటులో లేకపోవడంతో ఉపాధ్యాయులు తమ అధికారిక పనుల కోసం నిజామాబాద్‌లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోందని సంఘం పేర్కొంది. వార్షిక ఇంక్రిమెంట్లు, సరెండర్ బిల్లులు, మెడికల్ బిల్లులు, ఎన్ఓసీలు, మిడ్ డే మీల్ బిల్లులు, ప్రైవేట్ పాఠశాలల నివేదికలు తదితర పరిపాలనా పనుల కోసం ఉపాధ్యాయులు పనివేళల్లోనే జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తోందని తెలిపింది. గతంలో బోధన్‌లో డిప్యూటీ ఈవో కార్యాలయం పనిచేసి, క్లర్క్ సిబ్బంది అందుబాటులో ఉండటంతో ఉపాధ్యాయుల పనులు సులభంగా, వేగంగా పూర్తయ్యేవని సంఘం గుర్తుచేసింది. ప్రస్తుతం కార్యాలయం లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే స్పందించి బోధన్ డిప్యూటీ ఈవో కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించి, అవసరమైన సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.
