ఇందూర్, బతుకమ్మ :
కేంద్రం చేపడుతున్న జాతీయ జనగణనలో బీసీ కులగణన అంశం లేకపోవడాన్ని నిరసిస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీల ధర్మ పోరాట దీక్షకు పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పులాంగ్ చౌరస్తా వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ ప్రజలు బీసీల ధర్మ పోరాట దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ బీసీ కులగణనను చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఏదైతే క్యాబినెట్లో తీర్మానించి ఈరోజు వెనుకడుగు వేయడం సమంజసం కాదని, వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ జనగణనలో బిసి కుల గణన అంశాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎప్పుడో వంద సంవత్సరాల క్రిందట బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన బీసీ కులగణన తర్వాత ఇప్పటి వరకు బీసీల కుల గణన చేపట్టకపోవడం శోచనీయమని అన్నారు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క జంతువు లెక్క ప్రభుత్వం దగ్గర ఉంది కానీ బీసీల లెక్క లేకపోవడం విచారకరమన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు అనే అంశం తెలిస్తే ఎక్కడ తమ పీఠాలు కదిలిపోతాయోనని బీసీల కులగణనను ప్రభుత్వాలు చేయడం లేదన్నారు. బిసి కుల జరిగిన రోజే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వెంటనే బీసీ కులగణణ అంశాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు, కొయ్యాడ శంకర్, శ్రీలత, బగ్గలి అజయ్, కొట్టూర్ చంద్రకాంత్, సాయి బసవ, అపర్ణ, సురేందర్, సదానంద్, గంగాధర్, ఆర్టీసీ శ్రీనివాస్, నరసయ్య, అనిల్, జయ, రుక్మిణి, నరేందర్, దారం భూమన్న, సత్యనారాయణ, అంకంరావు తదితర బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
