సంగారెడ్డి, బతుకమ్మ :
సంగారెడ్డి జిల్లా బొల్లారం ఐడీఏలోని టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో అదనపు సహాయ ఇంజనీర్ (ఆపరేషన్స్)గా పనిచేస్తున్న బి. రామకృష్ణ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుడి కారుతో ఈ నెల 12వ తేదీన జరిగిన ప్రమాదంలో విద్యుత్ స్తంభం దెబ్బతిన్న ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు అధికారికి లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో రూ.25,000 లంచం తీసుకుంటుండగా గురువారం మధ్యాహ్నం సుమారు 1:25 గంటల సమయంలో అతడిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారిని కార్యాలయం సమీపంలోనే అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, అతడి వద్ద నుంచి రసాయనం పూసిన రూ.25,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా నిర్వర్తించాల్సిన విధులను సక్రమంగా చేయకుండా, అనుచిత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నేరస్తుడిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఎస్‌పీఈ & ఏసీబీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన గౌరవనీయులైన II అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. లంచం డిమాండ్ చేసే ఏ ప్రభుత్వ ఉద్యోగిపై అయినా ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ఏసీబీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ వెల్లడించింది.
