నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసిన విషయం విధితమే. దానికనుగుణంగా నామిషన్ల స్వీకరణ, ఉపసంహణ పూర్తి అయి, ప్రచారఘట్టం పరిసమాప్తం ముగిసిన వేళ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బిచ్కుంద, బాన్స్ వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి బార్ అసోసియేషన్లు ఏర్పాట్లు పూర్తి చేశాయి. నిజామాబాద్ బార్ అసోసియేషన్ లో 441 మంది న్యాయవాదులు ఓటర్లుగా ఉన్నారు, ఆర్మూర్ 111, బోధన్ 116, బిచ్కుంద 11, ఎల్లారెడ్డి 9, కామారెడ్డి 115 న్యాయవాదులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఆయా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్నికల అధికారులు వ్యవహరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బార్ అసోసియేషన్ కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఓటింగ్ కు అనుకూలంగా తయారు చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదులు తమ ఓటును వినియోగింకోవచ్చు. బ్యాలెట్ పేపర్లు ఇప్పటికే ఆయా బార్ అసోసియేషన్లకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు జరుగనున్నాయి. బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.బార్ కౌన్సిల్ సభ్యులు మొత్తం 23 మంది ఎన్నిక కానున్నారు. బార్ కౌన్సిల్ సభ్యులుగా పోటీ చేస్తున్న పలువురు న్యాయవాదులు ఇప్పటికే చాలా మంది న్యాయవాదులను వ్యక్తిగతంగా కలిసి ఓటు వేయాల్సిందిగా ప్రచారం నిర్వహించారు.
