. . . తెలంగాణ రియల్ ఓజి మా కేసీఆర్
. . . పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఫైర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఎస్‌ఐఆర్ సన్నాహక సమావేశంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ గురించి మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణ చరిత్రను, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినది కాదని, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, కోట్లాది ప్రజల ఆకాంక్షల ఫలితంగా సాధించుకున్న రాష్ట్రం అని స్పష్టం చేశారు. తెలంగాణ ముమ్మాటికీ ఈ నేలపై నివసిస్తున్న నాలుగు కోట్ల ప్రజలది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. సినిమాల్లో డైలాగులు చెప్పినంత సులభం కాదు తెలంగాణ ఉద్యమం. తెలంగాణ గురించి అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తెలంగాణ సాధనకు కర్త, కర్మ, క్రియ ఒక్క కేసీఆరేనని, ఉద్యమానికి నాయకత్వం వహించి రాష్ట్రాన్ని సాధించి, అభివృద్ధి పథంలో నడిపించిన మహానేత కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణకు ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఎవరైనా ఉంటే అది ఒక్క కేసీఆరే. తెలంగాణ అనే సినిమాను సృష్టించి భారతదేశ పటంలో గర్వంగా నిలబెట్టిన గాడ్‌ఫాదర్ కేసీఆర్ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించాలని, ఆంధ్ర రాజకీయాల ప్రభావంతో తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే ఏ వ్యాఖ్యనైనా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం పోరాడని వారు, ఉద్యమ చరిత్రలో భాగం కాని వారు తెలంగాణ గురించి ఉపన్యాసాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం శాశ్వతమని, ఆ స్థానాన్ని ఎవరూ చెరపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్, హన్మంతు షిండే, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, ఇంచార్జ్ రవీందర్ సింగ్, పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిర్ప రాజు, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సుజీత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

