24 C
Hyderabad
Sunday, August 2, 2026

విత్తనోత్పత్తికి తెలంగాణ అనువైన ప్రాంతం

Must read

📰 Generate e-Paper Clip

  • రైతు క‌మిష‌న్ చైర్మ‌న్ కొదండ రెడ్డి

 

హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ విత్తనోత్పత్తికి అనువైన ప్రాంత‌మ‌ని, దేశంలో 60 శాతం విత్తనాలు ఇక్క‌డే పండుతున్నాయ‌ని రైతు క‌మిష‌న్ చైర్మ‌న్ కొదండ రెడ్డి అన్నారు. తెలంగాణ‌లో పండించే విత్త‌నాన్ని ప్ర‌పంచ దేశాల‌కు ఎగుమ‌తి అవుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. బీఆర్కే భ‌వ‌న్ లోని రైతు క‌మిష‌న్ కార్యాల‌యంలో క‌మిష‌న్ స‌భ్యులు కేవీఎన్ రెడ్డి, గ‌డుగు గంగాధ‌ర్, భ‌వ‌నీరెడ్డిల‌తో క‌లిసి చైర్మ‌న్ కొదండ‌రెడ్డి మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో చైర్మ‌న్ కొదండ‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ లో ఎక్కువ‌గా మొక్కజొన్న, వరి, పత్తి విత్త‌నోత్ప‌త్తి అవుతుంద‌ని తెలిపారు. అయితే గ‌త‌ పదేండ్ల కాలంలో విత్త‌నోత్ప‌త్తి చేసే రైతులు అనేక ఇబ్బందులకు గుర‌య్యార‌ని, రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు తీసుకున్నతర్వాత రైతు సంక్షేమ పాల‌న సాగుతోంద‌న్నారు. అందులో భాగ‌మే  రైతు కమిషన్ను ఏర్పాటు చేశార‌ని గుర్తుచేశారు. పంజాబ్ లో రైతు, రైతు కూలీలకు మాత్రమే కమిషన్ ఉంద‌ని, వ్యవసాయం అక్క‌డి కమిషన్ పరిధిలోకి తేలేద‌న్నారు. కానీ తెలంగాణ‌లో వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేసిన విష‌యాన్ని వివ‌రించారు. రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో రైతు క‌మిష‌న్ ప‌ర్య‌టించి అనేక రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించింద‌న్నారు. ములుగు జిల్లాలో మొక్కనోన్న విత్తనోత్పత్తి లో జరిగిన మోసాలు తెల్సిన వెంట‌నే క‌మిష‌న్ స్పందించి, నిపుణుల క‌మిటీని వేసి రిపోర్ట్ తెచ్చుకుంద‌ని, త‌ర్వాత క‌మిష‌న్ ములుగు జిల్లాలో విచార‌ణ చేప‌ట్టి వాస్త‌వాల‌ను తెలుసుకోవ‌డ‌మే కాకుండా.. ఆదివాసీ గిరిజ‌న రైతుల‌కు న్యాయం చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. మల్టీనేషనల్ కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకొని విత్తనోత్పత్తి చేస్తున్నాయ‌ని, అయితే.. విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన 671 మంది రైతులకు నష్టపరిహారం కింద.. ఈనెల 7న ములుగు జిల్లా వాజేడు మండ‌లం నాగారం గ్రామంలో 4 కోట్ల రూపాయల చెక్కుల పంపిణి చేసిన విష‌యాన్ని గుర్తుచేశారు. ఆ కార్యాక్ర‌మంలో మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు, సీత‌క్క తోపాటు క‌మిష‌న్ హాజ‌రైంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు విత్తన కంపెనీల నుండి డబ్బు ఇప్పించిన దాఖలాలు లేవ‌ని, దేశంలోనే ఇది మొదటి సారిగా జ‌రిగింద‌న్నారు. మల్టీనేషనల్ కంపెనీలు రైతుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేలా ఒత్తిడి పెంచి దారిలోకి వచ్చేలా చేశామ‌న్నారు. విత్త‌న కంపెనీల‌తో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ రాజీపడలేదని గుర్తుచేశారు. విత్తన కంపెనీలను కట్టడి చేయడానికి త్వరలో విత్తన చట్టం రాబోతుంద‌ని తెలిపారు. వైఎస్ హయాంలో పత్తి విత్తన చట్టం తెచ్చిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని, విత్తన చట్టం రుపొంచించే పనిలో రైతు క‌మిష‌న్, వ్య‌వ‌సాయ శాఖ నిమ‌గ్న‌మైంద‌న్నారు. ఇప్ప‌టికే స్ట‌డీ టూర్ పై హర్యానాలో పర్యటించిన విష‌యాన్ని గుర్తుచేశారు. కేంద్ర ప్ర‌భుత్వం విత్త‌న చ‌ట్టం తీసుకురావాల్సింది పోయి.. రాష్ట్రాలు విత్త‌న చ‌ట్టం తెస్తుంటే అడ్డుకుంటున్నాయ‌ని మండిప‌డ్డారు. కేంద్రం రాష్ట్రాలకు కొన్ని చట్టాల విషయంలో స్వేచ్ఛ ఇవ్వాలన్నారు. మోడీ సొంత రాష్ట్ర‌మైన గుజ‌రాత్ లోనే పంటల బీమా పథకం అమలు కావడం లేదన్నారు. వ్యవసాయాన్ని రెండింతలు లాభసాటి చేస్తామ‌ని చెప్ప‌డ‌మే కానీ.. ఏం చేసింది లేద‌న్నారు.

  • త్వ‌ర‌లో ఆద‌ర్శ‌రైతు వ్య‌వ‌స్థ..

రాష్ట్రంలో మ‌ళ్లీ ఆద‌ర్శ‌రైతు వ్య‌వ‌స్థ‌ను రానున్న‌ట్లు రైతు క‌మిష‌న్ చైర్మ‌న్ కొదండ‌రెడ్డి తెలిపారు. ప్ర‌తి గ్రామానికి ఒక ఆద‌ర్శ‌రైతు ఉండేలా ప్లాన్  చేస్తున్నామ‌న్నారు. అయితే ఆద‌ర్శ‌రైతు ఎంపిక‌ను అగ్రిక‌ల్చ‌ర్ అధికారులు గ్రామాల్లో ప‌ర్య‌టించి ఎంపిక చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు. ఎంపికైన ఆదర్శ రైతుల‌కు ప్రభుత్వం గౌరవం ఇస్త‌ద‌ని, కానీ ఎలాంటి గౌరవ వేతనాలు ఉండ‌వ‌ని తెలిపారు. ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న విష‌యాన్ని ఎంపిక‌కానున్న‌ రైతులు అర్ధం చేసుకుంటార‌న్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు ఆదర్శ రైతుల చేతుల మీదుగా వెళ్లేలా చూస్తామ‌ని వివ‌రించారు. ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష 4వేల కోట్లు వ్య‌వ‌సాయ రంగానికి ఖర్చు చేసిందని తెలిపారు. సీయం రేవంత్ రెడ్డి రైతు బిడ్డా అని, అందుకే వ్య‌వ‌సాయ రంగానికి ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని గుర్తుచేశారు.

  • ఎరువుల కేటాయింపుల్లో వివ‌క్ష..

రాష్ట్రానికి ఎరువుల కేటాయింపుల్లో కేంద్రం వివ‌క్ష చూపుతోంద‌ని మండిప‌డ్డారు రైతు క‌మిష‌న్ చైర్మ‌న్ కొదండ రెడ్డి. తెలంగాణలో ఏ పంటలు పడుతున్నాయ్, ఏ రకమైన ఎరువులు కావాలో కేంద్రానికి తెల్వదా అని ప్ర‌శ్నించారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్నఈ సమయంలో ఇబ్బంది పెట్టడం స‌రికాద‌న్నారు. యూరియా, ఎరువుల పరిశ్రమలు.. కేంద్రం చేతుల్లో ఉంటాయ‌ని గుర్తుచేశారు. ఆయా రాష్ట్రాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎరువుల కేటాయింపులు స‌కాలంలో చేస్తే మంచిద‌న్నారు. సీయం రేవంత్ రెడ్డి ఎరువుల కోసం ఢిల్లీకి వెళ్లార‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడమే కాదు.. దానికి తగ్గట్టుగా ఆర్ధిక సాయం చేసి ప్రోత్స‌హించాల‌న్నారు. ఇక పంట‌ల్లో జన్యు మార్పిడి అనేది ప్రపంచానికే ప్రమాదమ‌ని హెచ్చ‌రించారు. దీనిపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా స్పందించార‌ని తెలిపారు. కేంద్రం బియ్యం లో జన్యుమార్పిడి కి అనుకూలంగా వ్యవహరిస్తుంటే.. దానిని రాష్ట్ర ప్ర‌భుత్వం త‌రుఫున‌ వ్యతిరేకిస్తూ లేఖరాశామ‌న్నారు. ప్రపంచాన్ని కొన్ని కంపెనీలు గుప్పిట్లో పెట్టుకోడానికి జ‌న్యు మార్పిడి పేరుతో జరుగుతున్న కుట్ర అని.. దీన్ని అందరు ఖండించాలి. మన్మోహన్ సింగ్ హయాంలో కూర‌గాయ పంట అయిన‌ వంకాయ విషయంలో జన్యుమార్పిడి అంటే వ్య‌తిరేకించామ‌ని.. దాంతో అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం వెనక్కి తగ్గిందన్నారు. రైతు క‌మిష‌న్ స‌భ్య‌లు కెవిఎన్ రెడ్డి మాట్లాడుతూ.. యూరియా విషయంలో కేంద్రం తెలంగాణపై నిర్లక్ష్యం చేస్తుంద‌న్నారు. రాష్ట్రానికి కావాల్సినంత యూరియాను కేంద్రం కేటాయించక పోవ‌డంతోనే రైతులు ఇబ్బందులు ప‌డ్తున్నార‌ని గుర్తుచేశారు. రైతులు సైతం యూరియా వాడకం తగ్గించుకుంటే మంచిద‌న్నారు. మ‌రో స‌భ్యురాలు భ‌వానీ రెడ్డి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో నష్టపరిహారం ఇప్పించడంలో రైతు కమిషన్ కృషి ఎంత‌గానో ఉంద‌న్నారు. దేశ చరిత్ర లోనే ఇది ఫస్ట్ టైం అని చెప్పుకొచ్చారు. గిరిజన రైతుల్లో సంతోషం చూసి ఆనందించామ‌న్నారు. తెలంగాణ‌లో ఏ రైతుకు క‌ష్టం వ‌చ్చిన‌రైతు క‌మిష‌న్ ఎప్ప‌టికి అందుబాటులో ఉంటంద‌న్నారు.

More articles

Latest article