
. ఆయన చరిత్రను వక్రీకరించారు
. ఇరిగేషన్ భూమిని ఆక్రమించి నిజామాబాద్ లో బీఆర్ఎస్ భవనం నిర్మాణం
. రాష్ట్ర జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకోగా.. కేవలం తన ఒక్కడి వల్లే రాష్ర్ట సాధన సాధ్యమైందని కేసీఆర్ గత పదేళ్లుగా మోసం చేస్తూ వస్తున్నారని రాష్ర్ట జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్ లో ఏర్పాటు చేసిన అభినందన సభ కార్యక్రమంలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది ఉద్యమించడంతోపాటు ఎంతో మంది బలిదానాలు చేయడంతో తెలంగాణ సిద్ధించిందన్నారు. కేసీఆర్ తన రాజకీయ స్వలాభం కోసం ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు అడుగడుగునా అవమానం, అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తరువాత నిజామాబాద్ లో అభినందన సభ ఏర్పాటు చేసిన జేఏసీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. సాధారణంగా సన్మానాలు తకు నచ్చవని, ఈ వేదిక ద్వారా సమస్యలపై మాట్లాడటం, ఉద్యమం గురించి మాట్లాడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వచ్చానని అన్నారు.
విలువైన ప్రభుత్వ భూములు కబ్జా
గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఆ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని అన్నారు. నిజామాబాద్ లో కూడా అదే జరిగిందని ఎల్లమ్మ గుట్టలో ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసి తెలంగాణ భవన్ నిర్మించారని ఆరోపించారు. అనంతరం జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల శర్మ ఆధ్వర్యంలో కోదండరామ్ ను ఘనంగా సన్మానించారు. దీంతోపాటు టీఎన్జీవో ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎల్ భాస్కర్, పీఎంపీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్, మైనార్టీ జేఏసీ ఎస్కే నజీర్ తదితరులు పాల్గొన్నారు.

