. . . జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ ఉద్యమకారుల కమిటీ ముందు ఉద్యమకారులు తమ సమస్యలను వివరించాలని జేఏసి చైర్మన్ గోపాల్ శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ, టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు గైని గంగారం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ నెల 27వ తేదీ శనివారం జిల్లాకు రానుందని తెలిపారు. ఈ సందర్భంగా గోపాల్ శర్మ, గైని గంగారం మాట్లాడుతూ కమిటీ సభ్యులైన కోదండరాం, అద్దంకి దయాకర్, రాములు నాయక్, శోభన్ రెడ్డి జిల్లాకు విచ్చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక కేసులు, పోలీసు నిర్బంధాలు ఎదుర్కొని రాష్ట్ర సాధన వరకు పోరాడిన ఉద్యమకారులందరూ కమిటీ ముందు తమ అనుభవాలు, సమస్యలు, త్యాగాలను వివరించాలని కోరారు. కమిటీ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తుందని, ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కోనేరు సాయికుమార్ మాట్లాడుతూ, 2001 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నానని తెలిపారు. ముఖ్యంగా 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభానికి ఐదు రోజుల ముందే అర్ధరాత్రి తమ ఇంటిపై పోలీసులు దాడి చేసి తనను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారని పేర్కొన్నారు. తనతో పాటు అనేక మంది ఉద్యమకారులు కూడా ఇలాంటి నిర్బంధాలను ఎదుర్కొన్నారని చెప్పారు. అలాగే 2009లో తనపై రైల్వే కేసు నమోదు చేసి సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరుపరిచి, అనంతరం చర్లపల్లి జైలుకు రిమాండ్ చేసినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యమకారులను రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వారికి తగిన గుర్తింపు ఇవ్వలేదని విమర్శించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఉద్యమకారుల సేవలను గుర్తించి, వారికి న్యాయం చేస్తుందని, ఉద్యమకారులను గౌరవంగా ఆదరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో దాదన్నగారి విట్టల్ రావు, కోనేరు సాయికుమార్, తెలంగాణ ఉద్యమకారులు షేక్ హుస్సేన్, సఖి విజయ్ కుమార్, ఎస్‌కే నజీర్, పుల్కా మోహన్, ప్రభుదాస్, ప్రవీణ్, కొత్తూరు శివరామకృష్ణ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
