. పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి
. మూడు వాయిదాల డీఏను ప్రకటించాలి
. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్క జనార్దన్
భీమ్ గల్, బతుకమ్మ : ఉపాధ్యాయులు, ఉద్యోగుల డీఏ(కరువు భత్యం) ఐదు వాయిదాలు పెండింగ్ లో ఉండగా, ఒక్క వాయిదాను మాత్రమే విడుదల చేయడం తగదని, రాష్ర్ట కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి ఉందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మల్ల జనార్దన్ అన్నారు. భీమ్ గల్ పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీవో 317పై దాటవేత తగదని, అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో బకాయి డీఏ, పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరిస్తామని, జీవో 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని గత పదినెలలుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా ఓపిక పట్టామని ఆయన అన్నారు. సగం మందికైనా నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తున్నందుకు సంతోషించామని, జీవో 317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినందున సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తారని ఆశించిన వారికి కమిటీ సిఫార్సులు తీవ్ర నిరాశను కలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు ఊసే లేదని, రెండేళ్ళుగా వేలాది బిల్లులు క్లియర్ కావడం లేదన్నారు. కరవు భత్యం ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకుండా పండుగలప్పుడు కానుకలుగా ఇస్తున్నట్లు ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం మూడు వాయిదాలు బకాయి పడితే ఈ ప్రభుత్వం వచ్చాక మరో రెండు వాయిదాలు వచ్చి చేరాయని కనీసం రెండు వాయిదాల డీఏ అయినా ఇప్పుడు ఇస్తారని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న సందర్భంలో కేవలం ఒక్క వాయిదా డీఏ మాత్రమే విడుదల చేయడాన్ని ఉద్యోగులు జీర్ణించుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి సమస్యలన్నింటినీ కాలయాపన లేకుండా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.