- అదే బాటలో సీసీఎస్
- సీసీఎస్ ఏసీపీ బదిలీ
- ఇంచార్జీ బాధ్యతల అప్పగింత ఎప్పుడో
- టాస్క్ ఫోర్స్ పున: వ్యవస్థాపన ఎన్నడో
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ శాఖలో పోలీస్ కమిషనరేట్ రెండు అంగాలు (టాస్క్ ఫోర్స్, సీసీఎస్) కీలకమైనవి. పోలీస్ బాస్ కనుసన్నులలో అసాంఘీక కార్యాకలపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఏర్పడిందే టాస్క్ ఫోర్స్. నేరాల నియంత్రణలో సివిల్ పోలీస్ లకు తోడుగా ఉన్నదే సెంట్రల్ క్రైం స్టేషన్(సిసిఎస్). పోలీస్ కమిషనర్ కు నేరుగా వచ్చే సమాచారంతో, ఫిర్యాదులకు తోడు, నిఘా వర్గాలు అందించే చిట్టాతో అసాంఘీక కార్యకలాపాలు, నేరాల నియంత్రణకు టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ల పని. అటువంటి రెండు పోలీస్ అనుబంధ శాఖలు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో గడ్డు కాలం ఎదుర్కుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిజామాబాద్ జిల్లా కమిషనరేట్ గా రూపాంతంరం చెందిన విషయం తెలిసిందే. అప్పటి వరకు ఉన్న ఐడిపార్టీ, క్యూఆర్టీ టీం ల స్థానంలో టాస్క్ ఫోర్స్ ఏర్పడింది. సీసీఎస్ ఎన్నటి నుంచో ఉన్నవ్యవస్థకు అదనంగా ఏసీపీలను అధికారులుగా నియమించేవారు. వారు కమిషనర్ ఆదేశానుసారం పనిచేయడం విధి.
పోలీస్ కమిషనరేట్ గా మారిన తరువాత జిల్లాలో గత కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ లేకుండానే పనిజరుగుతుంది. గతంలో టాస్క్ ఫోర్స్ ఇంచార్జీ ఏసీపీగా పనిచేసిన దివంగత అధికారి విష్ణుమూర్తిపై ఆరోపణలతో సస్పెండ్ చేశారు. తరువాత టాస్క్ ఫోర్స్ కు అధికారిని నియమించలేదు. సీసీఎస్ ఏసీపీగా ఉన్న నాగేంధ్రచారికి ఇంచార్జీగా బాధ్యతలు అప్పగించారు. ఇటీవల కాలంలో టాస్క్ ఫోర్స్ టీం ద్వారా సమాచారం లీక్ అవుతుండడం కొందరికి మామూళ్ళు అందుతున్నాయని కొందరు అక్కడే పాతుకపోయారని టీం మొత్తం బదిలీ చేశారు. దానితో టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఇంచార్జిగా పని చేస్తున్న నాగేంద్రచారి సీసీఎస్ కే పరిమితమయ్యారు. అక్టోబర్ 17న సీసీఎస్ కానిస్టేబుల్ రౌడిషీటర్ ను అరెస్టు చేసేందుకు వెళ్లి అతని చేతిలో హతమైన విషయం తెల్సిందే. ఈ కేసులో సంబంధం లేకపోయినా ఇద్దరు కానిస్టేబుళ్ళను బదిలీ చేశారు. దానితో సీసీఎస్ లో పని చేసేందుకు సిబ్బంది ఎవరు చొరవ తీసుకోలేదు. తాము కష్టపడి పని చేస్తే తమని బదిలీ చేస్తారన్న దోరణి పెరిగిపోయింది. తాజాగా ఈ నెల 22న సీసీఎస్ ఏసీపీగా ఉన్న నాగేంద్రచారిని సిరిసిల్లా డీఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దానితో సీసీఎస్ కు బాస్ కరువయ్యారు. టాస్క్ ఫోర్స్ టీం మొత్తం లేక దాని బాస్ గా ఉండాల్సిన ఏసీపీ పోస్టు కూడా ఖాళీగా ఉండడంతో పున:నియామకం ఎప్పుడనే చర్చ జరుగుతుంది. తాజాగా సీసీఎస్ ఏసీపీ బదిలీ అయిన ఎవరికి ఇంచార్జి బాధ్యతలు ఇవ్వకపోవడం కూడా పోలీసు శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పోలీసు కమిషనర్ కు అనుబంధంగా పని చేసే టాస్క్ ఫోర్స్ సీసీఎస్ నియామకాలు అన్నీ బాస్ చేతిలో జరుగాల్సి ఉంటుంది. సీసీఎస్ లో, టాస్క్ ఫోర్స్ లో ఏసీపీ స్థాయి అధికారులను డీజీపీ నియామకం చేస్తుండగా సిఐలు, ఎస్సైలను కూడా ఐజీ స్థాయి అధికారులు నియమిస్తారు. వారిని వర్క్ అడ్జస్ట్ చేయడంలో కీలకపాత్ర పోలీసు కమిషనర్ దే. అయితే గత కొన్ని రోజులుగా టాస్క్ ఫోర్స్ టీం మొత్తంను రద్దు చేసిన, తిరిగి కొత్త టీంలను నియమించకపోవడం పోలీసు శాఖలో తొలిసారి జరుగుతుంది. అదే విధంగా సీసీఎస్ లోనూ కీలక అధికారులు బదిలీ వ్యవహరంతో పాటు ఇంచార్జిలను నియమించకపోవడం, పోలీసులు ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరు షాడో అధికారులుగా చెలామణి అవుతున్న కానిస్టేబుళ్లు మొదలుకుని ఇతరులను బదిలీ వెనుక ఉన్నారని టాక్ నడుస్తోంది. సీసీఎస్ లో జరిగిన బదిలీల వెనుక ఒక ఎస్సై పేరు ప్రముఖంగా వినిపించింది. కొందరు బదిలీ అయిన కానిస్టేబుళ్ళ తప్పిదం ఏమిటని వారిని తిరిగి నియమించాలని డిమాండ్ చేసిన విషయం తెల్సిందే. నిఘా వర్గాల్లో పని చేస్తూ సీసీఎస్, టాస్క్ ఫోర్స్ లో తమకు సంబంధించిన వారికే, తాము చెప్పిన వారికే పోస్టింగ్ లు ఇప్పిస్తున్నారని పోలీసు శాఖ అంతా కోడై కూస్తోంది. టాస్క్ ఫోర్స్ సీసీఎస్ టీంల వ్యవహరంలో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.