25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఓటరు స్లిప్ తీసుకెళ్లండి..

Must read

📰 Generate e-Paper Clip

. పంచలేక చేతులెత్తేసిన సిబ్బంది

. అయోమయంలో పట్టభద్రులు

. ఇలా అయితే పోలింగ్ శాతం పెరిగేదెలా..?

నిజామాబాద్, బతుకమ్మ: ఎమ్మెల్సీ పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని ఓ వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం చెబుతుండగా.. మరో వైపు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గ్రాడ్యుయేట్లకు ఓటరు స్లిప్పులు చేరవేయాల్సిన సిబ్బంది చేతులెత్తేశారు. మీ ఓటరు స్లిప్పు మండల ఆఫీసులో ఉందని, వచ్చి తీసుకెళ్లాలని రెవెన్యూ సిబ్బంది పట్టభద్రులకు ఫోన్ లు చేస్తున్నారు. ఓటరు స్లిప్పును భద్రంగా ఇంటికి పంపించాల్సిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగైతే పోలింగ్ శాతం ఎలా పెరుగుతుందనే వాదన వినిపిస్తోంది. తమ ఓటు ఏ ప్రాంతంలో, ఏ బూత్ లో ఉందో తెలియదని గ్రాడ్యుయేట్ ఓటర్లు అంటున్నారు. ఎన్నికల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ఎన్నికల సంఘం క్షేత్రస్థాయిలో పరిస్థితిని పట్టించుకోవడం లేదని, ఇకనైనా దృష్టి సారించాలని అంటున్నారు. ఇది తమను అవమానించడమేనని, ఇలా అయితే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేసే వారే కరువవుతారని పేర్కొంటున్నారు.

పార్టీల తీరూ అంతే..

తమ పార్టీ అభ్యర్థికే మీ అమూల్యమైన ఓటు వేయాలని జోరుగా ప్రచారం చేస్తున్న రాజకీయ పార్టీలూ తమను పట్టించుకోవడం లేదని పట్టభద్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా వస్తున్న ఫోన్ కాల్స్ మాట్లాడుతున్న గ్రాడ్యుయేట్లు తమకు ఇప్పటి వరకు ఓటరు స్లిప్పు రాలేదని నిలదీస్తున్నారు. దీంతో తమ పార్టీ కార్యకర్తలు వచ్చి ఓటరు స్లిప్పు అందజేస్తారని వారు సమాధానమిస్తున్నా చేతికి మాత్రం ఓటరు స్లిప్పులు అందడం లేదు.

47,984 మంది ఓటర్లు

ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజామాబాద్ లో 31,574, కామారెడ్డిలో 16,410 మంది మొత్తం 47,984 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.

More articles

Latest article