28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. పదవ తరగతిలో వివిధ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించేందుకు వీలుగా జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో రెమిడియల్ క్యాంప్ పేరిట ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని శంకర్ భవన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థిని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతోనూ భేటీ అయ్యారు. ఒకటి, రెండు సబ్జెక్టులలో తప్పిపోయినంత మాత్రాన అనవసర ఆందోళనకు గురి కావద్దని సూచించారు.

 

Take advantage of special training classes

 

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మరో మూడు వారాల వరకు సమయం మిగిలి ఉన్నందున ఏకాగ్రతతో శ్రద్ధగా చదువుకోవాలని, శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు. మీరు మీ కోసం కష్టపడి చదివి మంచి మార్కులు సాధిస్తే, మీ తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషిస్తారని అన్నారు. జీవితంలో ఓటములు ఎదురవడం సహజమేనని, వాటిని భవిష్యత్తు విజయాలకు సోపానాలుగా మార్చుకోవాలని హితవు పలికారు. ఉన్నత స్థానాలకు చేరాలంటే షార్ట్ కట్స్ అంటూ ఏవీ ఉండవని, విద్యార్థి దశలో కష్టపడితే జీవితం అంతా సుఖ సంతోషాలతో గడపవచ్చని మార్గనిర్దేశం చేశారు. స్పష్టమైన గమ్యాన్ని నిర్దేశించుకుని, ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో కృషి చేయాలని సూచించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, సెల్ ఫోన్లను కొన్నాళ్ళ పాటు పక్కన పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను కట్టడి చేయాలని, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం స్మార్ట్ ఫోన్ల విషయంలో కొంత కటువుగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.

 

Take advantage of special training classes

 

. . . సమ్మర్ క్యాంప్ ను సందర్శించిన కలెక్టర్

వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల కోసం శంకర్ భవన్ పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ శిబిరంలో విద్యార్థులకు వివిధ అంశాలలో అందిస్తున్న తర్ఫీదు గురించి ఆరా తీశారు. చిన్నారులతో కలెక్టర్ ముచ్చటిస్తూ వారి అభిరుచుల గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, డాన్స్, సింగింగ్, ఇండోర్ గేమ్స్ వంటి వాటిలో మెళుకువలను నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు వేస్తూ, చక్కగా సమాధానాలు ఇచ్చిన చిన్నారులకు కలెక్టర్ ప్రత్యేకంగా బహుమతులు, చాక్లెట్లు అందజేశారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యా శాఖ అధికారి పి. అశోక్, ఎంఈఓ లు సాయిరెడ్డి, అరవింద్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయన్న తదితరులు ఉన్నారు.

 

Take advantage of special training classes

More articles

Latest article