- భర్తే హత్య చేసి ఉంటాడని అనుమానాలు
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ 7వ వార్డు పరిధిలో గల తిరుమల కాలనీలో శనివారం ఉదయం ఆకుల లావణ్య (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు, ఆర్మూర్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని ఆకుల ప్రవీణ్ 9 సంవత్సరాల కిందట జక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన లావణ్యను వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ముగ్గురు సంతానం కాగా.. వారిలో కుమార్తెలు అక్షయ, అద్వైత లు, చిన్న కుమారుడు నిహాల్ లు ఉన్నారు. ఆకుల లావణ్య కు చెందిన మామ బుచ్చన్న గత కొన్ని సంవత్సరాల కిందట రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టి గృహం నిర్మించిన విషయంలో ఆర్థికంగా వీరి కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆ రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులతో ఈ ఆర్థిక లావాదేవీలపై తరచు గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇదే విషయంలో మృతురాలు ఆకుల లావణ్య ఆమె మామ బుచ్చన్నతో బైక్ పై వెళ్ళింది. ఈ విషయంపై ఆకుల లావణ్యకు ఆమె భర్త ప్రవీణ్ తో గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. శనివారం ఉదయం వారింట్లో మృతురాలు ఆకుల లావణ్య గొంతు కోసి ఆ బెడ్ రూమ్ లోని బెడ్ షీట్ లో ఆమె మృతదేహాన్ని చుట్టి ఉంచినట్లు స్థానికులు పోలీసులు గుర్తించారు. మృతి చెందిన ఈ వివాహిత ఆకుల లావణ్య మృతికి ఆర్థిక కారణాలు కారణమా..! లేక వివాహేతర సంబంధాలు కారణమా అనే విషయాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తిరుమల కాలనీకి చెందిన స్థానికులు ఈ వివాహిత మృతికి ఆమె భర్త ఆకుల ప్రవీణ్ కారణమై ఉంటాడని గుసగుస లాడుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్సై రమేష్ పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. మృతురాలి బంధువుల, స్థానికుల సమాచారం మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.

