బతుకమ్మ,మోర్తాడ్: ప్రతి ఒక్కరు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని బోధన్ ఎమ్మెల్యే మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించి చదివించి మంచి ఫలితాలు సాధించాలని ఆయన పేర్కొన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించి అనంతరం ఆలయంలో ప్రతిష్టించడం జరిగింది. స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయమును పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం తరగతి గదుల నిర్మాణం చేసిన గదులను ప్రారంభించారు. ఈ తరగతి గదుల నిర్మాణం కోసం ముస్కు అనుప్ కుమార్ రెడ్డి రూ.12 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా అనూప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్, గడువు గంగాధర్, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్, ధర్మోరా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవేందర్, అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

