– విద్యార్థి పోరాటాల గొంతుక పిడిఎస్యు
– పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకులు వి. సంఘం
బతుకమ్మ, బోధన్ : విద్యార్థుల సమస్యల పై ప్రభుత్వాలతో పోరాడిన అమరుల స్ఫూర్తి తో పోరాటాలు చేసిన పి డి ఎస్ యు విద్యార్థుల గొంతుక అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర నాయకులు వి.సంఘం అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం బోధన్ పట్టణంలోని పిఆర్టియు భవన్ లో పి డి స్ యు అర్ద శతాబ్దొత్సవ సభ ల “”లోగో””ను పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు వి సంఘం , పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి శ్రీనివాస్ లు ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు వి. సంఘం మాట్లాడుతూ అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య అందించాలని, శాస్త్రీయ విద్యా కై రాష్ట్రంలో 50 వసంతాల నుండి పి డి ఎస్ యు ఉద్యమిస్తూ విద్యార్థి పోరాటాల గొంతుకగా నిలిచిందన్నారు. పి డి ఎస్ యు జెండాను నిలబెట్టడం కోసం అనేకమంది విప్లవ విద్యార్థులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ముందుండి పోరాడారని వారిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు . అలాగే దేశంలో విద్యా వ్యాపారీకరణ ,కార్పోరేట్ కరణ ,కాషాఈకరణ వైపు మార్చేలా పాలకులు అడుగులేస్తున్నారని దీనిని అరికట్టకపోతే విద్య అందని ద్రాక్ష లాగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలను ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చి మూసివేసి విద్యకు దూరం చేయడం ఇంతకన్నా దుర్మార్గం మరొకటి లేదన్నారు. అమరుల స్ఫూర్తితో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పి డి ఎస్ యు పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి శ్రీనివాస్ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఒకరి నుండి మరొకరు దోచుకునే దోపిడీ వ్యవస్థ నిర్మూలించాలని, కామన్ విద్యా విధానం అమలు చేయాలని నిరంతరం పోరాటం జరుగుతుందన్నారు.. ప్రభుత్వాలు ఎవరు అధికారంలోకి వచ్చిన విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుందని దీనిని గమనించకుండా విద్యార్థి వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న పాలకవర్గాలపై పి డి ఎస్ యు మరింత ముందుండి పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ కార్తీక్ జిల్లా నాయకులు సాయినాథ్ పూర్వ నాయకులు సుధాకర్ అరుణ్ , పోశెట్టి, భీం రావ్, విద్యార్థులు సాయిబాబా, అమూల్య, అంబిక, స్వప్న, సంయుక్త, హర్షిని, రవి ,రాజకుమార్, ప్రకాష్ లతో విద్యార్థులు పాల్గొన్నారు.
