- డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ ఇ.రేవతి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : పటిష్టమైన ఆర్థిక వ్యూహాలే భారత సుస్థిరాభివృద్ధికి మార్గాలని డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ ఇ.రేవతి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం లో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఎంపవరింగ్ ఇండియా 2047: స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ” అనే అంశం పై జరిగిన జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ ఇ.రేవతి మాట్లాడారు. ఆధునిక భారతావనిలో అర్థశాస్త్ర శాస్త్ర అభివృద్ధి పరిధి పెరిగి వేగం పుంజుకోవడంతో దశాబ్ద కాలంలో ప్రపంచ స్థాయిలో అత్యధిక జీడీపీ ఉన్న మూడవ అతిపెద్ద దేశంగా ఆవిర్భవించింది అన్నారు. బ్రాంట్ ల్యాండ్ కమిషన్ మొదలుకొని వికసిత్ భారత్ వరకు జరిగిన అభివృద్ధి వ్యూహాలను సమగ్రంగా తెలిపారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యలు పేదరిక నిర్మూలన, నిరుద్యోగ నిర్మూలన, ఉపాధి కల్పన అవకాశాలు పెరుగుదల, ఆరోగ్య అభివృద్ధి, విద్యాభివృద్ధి పై పూర్తి గణాంకాలు అందించారు. సుస్థిరాభివృద్ధి వలన భారత ఆర్థిక విధానాల్లో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పులతో ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, లిబర్లైజేషన్ దాటి ఈనాటి డిజిటలైజేషన్ వరకు వెళ్ళిందన్నారు. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లోన్ టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీలు పెరగడంతో పెట్టుబడులకు ఎల్లలు లేకుండా బహుళ జాతి కంపెనీలు ఉత్పాదకతను ఉత్పత్తిని పెంచుకుంటూన్నాయన్నారు. వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు మాట్లాడుతూ పటిష్టమైన ఆర్థిక వ్యూహాలే భారత సుస్థిరాభివృద్ధికి మార్గాలన్నారు. విశాల భారతదేశంలోని విస్తార మైన స్థానిక వనరులను ఉపయోగించుకొని ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరిస్తే 2047 నాటికి ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలబడుతుందన్నారు. అత్యంత విలువైన మానవ వనరులున్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అన్నారు. ఈ మానవ వనరులకు సాంప్రదాయ విద్యా విధానంతో కాకుండా నాణ్యమైన ఆధునిక సాంకేతిక విప్లవంతో ఉపాధి అవకాశాలుండే విద్యా విధానాన్ని ఆవిష్కరించుకోవాలన్నారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి మాట్లాడుతూ 2047 నాటికి భారత దేశం స్వతంత్ర భారత శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుందన్నారు. స్వతంత్రం వచ్చిన ఈ 100 సంవత్సరాలలో భారతదేశం ప్రపంచానికి అనేక రంగాలలో మార్గనిర్దేశ లక్ష్యంతో ముందుకు పోతుందన్నారు. సుస్థిర భారత దేశ అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రమాణాలతో, వ్యూహాలతో ముందుకు పోతూ నేడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా విస్తరించిందని పేర్కొన్నారు. 2030 నాటికి మరింత వేగం పెంచుకొని 2047 నాటికి ప్రపంచంలో 30 ట్రీలియన్ల జిడిపితో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ డా. ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ ఈ సెమినారు చర్చలు వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ గాఉపయోగపడుతుందన్నారు వికసితభారత్ లక్ష్యాలు భారతదేశంలోని అనేక ఆవిష్కరణలకు, సవాళ్లకు పరిష్కారం చూపుతుందన్నారు. సెమినార్ కన్వీనర్ అర్థశాస్త్ర విభాగాధిపతి, డాక్టర్ ఏ పున్నయ్య మాట్లాడుతూ అమెరికా, సౌత్ కొరియా, బ్రిటన్ దేశాల నుండి ప్రామాణికమైన పత్రాలు అందడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలనుండి 140 పత్రాలు వచ్చినాయన్నారు. ఈ సదస్సులో తెలంగాణ విశ్వవిద్యాలయ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

