- తహశీల్దార్ తారాబాయి
రుద్రూర్, బతుకమ్మ: ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే చర్యలు తప్పవని రుద్రూర్ తహశీల్దార్ తారాబాయి అన్నారు. శనివారం రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో సర్వే నంబర్ 246లో ప్రభుత్వ స్థలాలను అక్రమంగా కబ్జాలకు పాల్పడిన విషయం తెలుసుకొని తన సిబ్బందితో అక్బర్ నగర్ గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే నంబర్ 246 లోని స్థలాలలో నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని సిబ్బందిని ఆదేశించారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్మాణాలు చేపడుతున్న వారి వారి స్థలాలకు సంబంధించిన పత్రాలు సోమవారంలోగా సమర్పించాలని లేనిచో నిర్మాణాలను కూల్చివేస్తామని అన్నారు. కబ్జా చేసుకున్న స్థలాలను ప్రభుత్వం స్వాధీనపరచుకొని ఇల్లు లేని నిరుపేదలకు గుర్తించి పంపిణీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. తహశీల్దార్ వెంట డిప్యూటీ తాహసిల్దార్ సురేందర్ నాయక్, ఎంపీడీవో శ్యామ్ రావు, మండల సిబ్బంది తదితరులు ఉన్నారు.