- పాంగ్రా హత్య కేసును చేధించిన పోలీసులు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని పాంగ్రా ప్రాంతంలో ఈ నెల 9న హత్యకు గురైన దోశి వసంత్ కుమార్ హత్య కేసును చేధించినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. హత్యకు గల కారణాలను ఆయన గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గాజుల్ పేట్ లోని బురుడు గల్లీకి చెందిన సర్దార్ తేజ సింగ్ జల్సాలకు అటవాటు పడి దొంగతనాలకు పాల్పడేవాడు. ఇదే క్రమంలో ఈనెల 7న నగరంలోని గంగాస్థాన్ ఫేజ్ -2 ప్రాంతంలో ఒక ద్విచక్రవాహన్ని దొంగిలించాడు. దొంగిలించిన బైక్ ను అమ్మేందుకు ఈనెల 9న నగరంలోని ఆర్య నగర్ లో గల సంజీవరెడ్డి కాలనీకి చెందిన తన స్నేహితుడైన దోశి వసంత్ కుమార్ ను సంప్రదించాడు. తనకు డబ్బులు అవరసరం ఉన్నాయని తన బైక్ పై రూ.25వేలు రుణం ఇప్పించాలని కోరాడు. వసంత్ కుమార్ వాహనానికి సంబంధించిన పత్రాలు ఇస్తే రెండు మూడు రోజుల్లో రుణం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో సర్దార్ తేజ సింగ్ ఆ వాహనం తన మిత్రుని పేరు మీద ఉందని ఎలాగైనా రుణం ఇప్చించాలని బతిమిలాడాడు. వసంత్ కుమార్ తానే తాకట్టు పెట్టుకుని రూ.3వేలు ఇచ్చాడు. అనంతరం ఇద్దరు కలిసి పాంగ్రా ప్రాంతంలో మద్యం సేవించారు. ఈ క్రమంలో వసంత్ కుమార్ వాహనానికి సంబంధించిన పత్రాల గురించి అడుగగా నిందితుడు పొంతన లేని సమాధానం ఇచ్చాడు. అనుమానం కలిగిన వసంత్ కుమార్ నిందితున్ని నిలదీశాడు. ఈ వాహనాన్ని దొంగతనం చేశావని, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నాడు. దీంతో తాను చేసిన దొంగతనం బయటపడుతుందని సర్దార్ తేజ సింగ్ పక్కనే ఉన్న బండరాయితో వసంత్ కుమార్ తలపై, మొఖంపై బలంగా బాదాడు. దీంతో వసంత్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా పాంగ్రా బోర్గాం(పి) గ్రామ శివారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న సర్దార్ తేజ సింగ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు, హత్యకు ఉపయోగించిన బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చేదనలో చాక చక్యంగా వ్యవహరించి నేరస్థులను పట్టుకున్న నిజామాబాద్ టౌన్ సీఐపీ జి. శ్రీనివాస్ రాజ్, నాల్గవ టౌన్ ఎస్ఐ కే. శ్రీకాంత్, సిబ్బందిని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అభినందించారు.
