- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి,శ్రామిక మహిళా రాష్ట్ర నాయకురాలు పద్మశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పని ప్రదేశాలలో మహిళా కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని శ్రామిక మహిళ రాష్ట్ర నాయకులు పద్మ శ్రీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం శ్రామిక మహిళ జిల్లా సదస్సు లో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిదిగా హాజరైన పద్మశ్రీ మాట్లాడుతూ శ్రామిక మహిళలు పనిచేస్తున్న చాలా రంగాలలో, పని ప్రాంతాలలో, ప్రదేశాలలో కనీసం బాత్ రూమ్ ల.సౌకర్యం కూడా ప్రభుత్వం, యాజమాన్యాలు కల్పించడం లేదని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని 2024 సంవత్సరంలో 31 వేల అత్యాచారాల కేసులు దేశంలో నమోదయ్యాయని ప్రతి 17 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతున్నదని అవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి పని ప్రదేశంలో కంప్లైంట్ బాక్స్ లు ఏర్పాటు చేయాలని ఉన్న అది అమలుకావడం లేదని విమర్శించారు.మహిళలను ఐక్యం చేసి వారిని హక్కుల కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న నయా ఉదారవాద విధానాలు కార్పొరేట్-మతోన్మాదుల ప్రయోజనాల కోసమే దోహదపడుతున్నాయి. మొత్తం కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు మహిళలు మరింత హీన స్థితికి దిగజారే విధానాలను తీసుకొస్తున్నారు. శ్రమను గౌరవించకపోవడం, గౌరవప్రదమైన వేతనాలు నిర్ణయించకపోవడం వారి విధానంగా మారింది. దీంతో పాటు శ్రమ చేసే శ్రామిక మహిళలను గౌరవించడం లేదు. పోరాడి సాధించుకున్న శ్రామిక మహిళల హక్కులను హరిస్తున్నారు. వారికున్న కొద్దిపాటి చట్టాలను రద్దు చేస్తున్నారు. ఇప్పటికే పారిశ్రామికవేత్తల లాభాల కోసం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చారు. ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల ఇప్పటికే ఉన్న మెటర్నిటీ బెనిఫిట్స్, క్రెచ్ల ఏర్పాటుకి ప్రమాదం ఏర్పడింది. రాత్రి షిఫ్ట్లలో మహిళల చేత రాత్రి 9 గంటల నుండి ఉదయం 7-00 గంటల వరకు పని చేయాలని షరతులు పెట్టారు. భూగర్భ గనుల్లో సైతం పనులు పురమాయించాలని నిర్ణయించారు. అత్యధికులు మహిళలు పనిచేసే బీడీ, భవన నిర్మాణం రంగాలకున్న సెన్ యాక్ట్ను రద్దు చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం పథకం, ఆర్పి, ఐకెపి విఓఏ, ఫీల్డ్ అసిస్టెంట్, మెడికల్ & హెల్త్ 2వ ఏఎన్ఎం, యూరోపియన్ ఏఎన్ఎం లాంటి స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించ నిరాకరించారు. వీరికి కనీసం వేతనం, పని గంటలు, ఉద్యోగ భద్రత, పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలన్నింటినీ నిరాకరించే విధంగా లేబర్ కోడ్లలో పొందుపర్చారు.అని ఆయన అన్నారు. అనంతరం బతుకమ్మ ఆటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాటలు పాడుతూ ఆట పాటలతో అలరించాయి. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నూర్జహాన్, శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సిఐటియు జిల్లా కోశాధికారి స్వర్ణ, జిల్లా నాయకులు రేణుక సుకన్య, భారతి, హర్ష, నాగం శాలిని, జరీనా, తనుజ, బాలామణి సుమలత, లలిత సరిత సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మోహన్ జంగం గంగాధర్ ,కటారి రాములు, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్ప లింగం తదితరులు పాల్గొన్నారు.

