కామారెడ్డి, బతుకమ్మ : పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు ప్రయత్నిస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 64 సెంటర్లలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జుక్కల్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ సెంటర్ లో కొంత మంది మాల్ ప్రాక్టీస్ కు యత్నించారని తెలిపారు. డీఈఓ, పోలీసులు వారి ప్రయత్నాన్ని భగ్నం చేశారని తెలిపారు. ఇందులో కీలక పాత్ర పోషించిన ఆరుగురిని అరెస్ట్ చేసి సీసీఎస్-1, సీసీఎల్ -2 జువైనల్ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. జుక్కల్ జడ్పీహెచ్ఎస్ సెంటర్ లో ఒక విద్యార్థి పరీక్ష రాస్తున్నాడని పేర్కొన్నారు. ఆ విద్యార్థికి పరీక్షలో సహాయం చేసేందుకు అతని తండ్రి ప్రయత్నించాడని అన్నారు. అందుకోసం ఎగ్జామ్ సెంటర్ లో తాత్కాలికంగా వాటర్ సప్లై కోసం నియమించబడిన ఒక వ్యక్తితో కొన్ని ప్రశ్నలు బయటికి తెప్పించే ప్రయత్నం చేశాడని తెలిపారు. సెంటర్ బయట సంజయ్ అనే వ్యక్తి ఈ ప్రశ్నలు సేకరించాడని తెలిపారు. అతని దగ్గర నుంచి కొంత మంది మీడియా ప్రతినిధులు ఆ ప్రశ్నలను సేకరించి కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నారు. విషయాన్ని తెలసుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఈ ప్రయత్నంలో ఉన్న వారిని గుర్తించారన్నారు. జుక్కల్ మండలంలోని కంటలి తాండకు చెందిన జాదవ్ సంజయ్, జుక్కల్ మండలానికి చెందిన వాటర్ మెన్ సయీద్ ముబీన్, జుక్కల్ కు చెందిన కండి మనోజ్, జుక్కల్ కు చెందిన ఇబత్ వార్ వరప్రసాద్, మరో మగ్గురు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. వారిని అరెస్ట్ చేసి జువైనల్ కోర్టులో హాజరు పరిచారిచామని పేర్కొన్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
