సింగిల్ ల్యాండ్… డబుల్ రిజిస్ట్రేషన్…

0 16,257

 

. . . ఫేక్ దస్తావేజులతో కోట్లలో లావాదేవీలు

 

. . . అధికారుల మిలాఖత్‌తో వైట్ కాలర్ దందా

 

. . . ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్న ల్యాండ్ మాఫియా

 

. . . నష్టపోతున్న యజమానులు… సామాన్యులు

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. ప్రధానంగా పాడావు భూములతో పాటు యజమానులు లేని భూములు కనిపిస్తే చాలు రాత్రికి రాత్రే డాక్యుమెంట్లు తయారు చేసి అమ్మేస్తున్నారు. బంగారం ధర ఆకాశాన్నంటగా, దానికి దీటుగా ఉన్న భూముల ధరలు కూడా ఏమాత్రం తగ్గకపోవడంతో భూ మాఫియా వాటిపై కన్నేసి కబ్జాలకు తెర లేపుతోంది. ప్రధానంగా రెవెన్యూ శాఖలో కొందరు ఉద్యోగులు, దస్తావేజు లేఖకులు, సూడో ముసుగులో ఉన్న జర్నలిస్టులమని చెప్పుకునే కేటుగాళ్లు కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి కోట్ల రూపాయల భూములను అమ్మేస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలో కొందరు మిలాఖత్ కావడంతో ఈ వ్యవహారం బహిర్గతం కావడానికి సమయం పడుతోంది. గత నెల చివరి వారంలో నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదుతో ఒక డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నగర శివారులోని బైపాస్ సమీపంలో ఓ వ్యక్తి తన స్వార్జిత భూమిని 1981లో సొసైటీకి దానం చేసిన రిజిస్ట్రేషన్‌ను 40 ఏళ్ల తర్వాత మార్చి, దానికి యజమానిని తయారు చేసి భూమిని అమ్ముకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

 

Single land… double registration…

 

సొసైటీకి రిజిస్ట్రేషన్ చేసిన భూ యజమాని సంబంధికులతో ముందుగా ఒక డాక్యుమెంట్ తయారు చేసి ఈ వ్యవహారం నడిపినట్లు స్పష్టమైంది. తమ చేతికి మట్టి అంటకుండా, రెవెన్యూ శాఖలో పని చేస్తున్న ఒక ఉద్యోగి, ఒక యూట్యూబ్ రిపోర్టర్ కలిసి భూ యజమాని రక్త సంబంధీకుల పేరిట తొలుత రిజిస్ట్రేషన్ చేసినట్లు రికార్డుల్లో తయారు చేశారు. అతడి నుంచి నవీపేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి సంబంధిత భూమిని విక్రయించడం విశేషం. దాదాపు 20 లక్షలలోపు తొలి సేల్ డీడ్‌తో వ్యవహారం ప్రారంభించి, థర్డ్ పార్టీ ద్వారా అమ్మకాలకు తెర లేపారు. పూర్వపు కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తికి వెయ్యి గజాలు అమ్మేశారు. సంబంధిత భూమిని రిజిస్ట్రేషన్ చేయమంటే నిషేధిత భూముల జాబితాలో ఉందని ఏడాది కాలంగా నెట్టుకొచ్చారు. అదే సమయంలో మిగిలిన భూమిని ప్లాట్లుగా విభజించి మరికొందరికీ అమ్మేశారు. ఈ వ్యవహారంలో దాదాపు 2 నుంచి 3 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. అయితే అమాయకులైన కొందరు ఈ భూమి గతంలోనే దానం చేయబడిందని తెలియక, అది వ్యవసాయ భూమిగా ఉండగా గజాల చొప్పున రిజిస్ట్రేషన్ చేస్తామని డబ్బులు తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా వారిని రెవెన్యూ, మున్సిపాలిటీ, రిజిస్ట్రేషన్ శాఖల చుట్టూ తిప్పుతున్నా పని జరగకపోవడంతో కొందరు ఆరా తీయగా డబుల్ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన నవీపేట్ మండలానికి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. డబుల్ రిజిస్ట్రేషన్ అంతా తాము డబ్బులు చెల్లించి చేసుకున్నామని, తమ ప్రమేయం లేదని కొందరు తమ పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. సూడో రిపోర్టర్ ముసుగులో ఉన్న కొందరు ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చి కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

 

Single land… double registration…

 

నిజామాబాద్ నగరంలో భూ కబ్జాలకు కొందరు మాఫియాగా ఏర్పడ్డారు. ఇందులో కీలకంగా రెవెన్యూ, ల్యాండ్ సర్వే, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖలలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, అలాగే సూడో జర్నలిస్టులుగా చెప్పుకునే కొందరు కలిసి గ్యాంగ్‌గా పనిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూములపై డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి, సెటిల్‌మెంట్ పేరుతో పోలీసులను కూడా ఇందులోకి లాగుతున్నారని సమాచారం. ప్రధానంగా 3వ టౌన్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి వరకు బైపాస్ ప్రాంతంలో ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా 5వ టౌన్, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ భూములకు కూడా ఇంటి నంబర్లతో ఫేక్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూములను సివిల్ మ్యాటర్‌గా చూపిస్తూ ట్రెస్పాస్ కేసుల పేరుతో అసలు భూ యజమానులను రానివ్వకుండా ఫోర్జరీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తెలుస్తోంది. భూ మాఫియా వెనుక అధికార పార్టీ నాయకులు కూడా ఉన్నారని ఆరోపణలు ఉండటంతో అసలైన భూ యజమానులు నష్టపోతున్నారు. అదే విధంగా డాక్యుమెంట్లు ఉన్నాయని నమ్మి కొనుగోలు చేసిన అమాయకులు కూడా తమ పెట్టుబడి మొత్తం కోల్పోతున్నారు. ఈ మొత్తం వ్యవహారం కొన్ని శాఖల అధికారులకూ తెలిసినా, కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్న కారణంగా రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్, పోలీస్ శాఖలు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.