- ఒకప్పుడు సీఆర్పీఎఫ్ బెటాలియన్ కోసం కేటాయింపు
- 2021లో కబ్జాను నిరోధించి కందకం తవ్విన రెవెన్యూ శాఖ
- ఐదు నెలల క్రితం శిఖం భూమిలో ఇస్తేమ నిర్వాహణకు అనుమతి
- ఫిర్యాదు చేసినా మజ్లీస్.. సర్వే చేసిన రెవెన్యూ అధికారులు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం సారంగాపూర్ శివారు భూమిలో ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహరం వెలుగు చూసింది. నిజామాబాద్, బోధన్ జాతీయ రహదారి 63ను ఆనుకుని ఉన్న చెరువు శిఖం భూమి 10 ఎకరాల్లో ప్లాట్ల దందా షురూ అయింది. తాజాగా అక్కడ హద్దురాళ్ళను పాతుతూ ప్లాట్లను విక్రయాలకు తెర లేపారు కొందరు. గత కొన్ని సంవత్సరాలుగా శిఖం భూమిలో ప్రభుత్వ భూమిగా గుర్తించి దాదాపు దశాబ్ధ కాలం అక్కడ సీఆర్పీఎఫ్ బెటాలియన్ నిర్వహించారు. దాదాపు దశాబ్ధ కాలం తర్వాత 2021లోనూ అక్కడ కొందరు ప్లాట్లను విక్రయించారు. దానితో అక్కడ స్థానికుల ఫిర్యాదుతో ఆనాడు రెవెన్యూ యంత్రాంగం 10 ఎకరాల శిఖం భూమి సర్వే నంబర్ 231 చుట్టురా కందకాన్ని తవ్వేశారు. తాజాగా అక్కడ ప్రభుత్వ భూమిలో మరోసారి వెంచర్ ఏర్పాటు చేస్తూ ప్లాట్ల విక్రయానికి తెర లేపారు. దానిపై తాజాగా మజ్లీస్ పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ కు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మైనార్టీ కాంగ్రెస్ లీడర్ ఒకరు దశాబ్ధాల కాలంగా రియల్ దందాలో ఉన్నారు. ఆయన హయంలో 231 సర్వే నంబర్ పక్కన ఉన్న ప్రైవేట్ భూమి ఎకరం 28 గుంటల భూమికి సంబంధించిన పట్టా భూమితో వెంచర్ ను ఏర్పాటు చేశారు. సంబంధిత భూమి హద్దులు పత్రాలతో కొత్తగా ప్లాట్లను ఏర్పాటు చేసి వెంచర్ మాదిరిగా అమ్మకాలు చేశారు. 2021లో జరిగిన ఈ తతంగం తెలిసిన రెవెన్యూ అధికారులు సంబంధిత చెరువు శిఖం భూమి కబ్జాలో జరిగిన వెంచర్ ప్లాట్ల విక్రయాలను అడ్డుకునేందుకు కందకాలను తవ్వి వదిలేశారు. ఆనాడు అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు సంబంధిత కాంగ్రెస్ లీడర్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా రెండవ సీజన్ లో జరిగిన ఈ తతంగం మహమ్మారి కారణంగా బహిర్గతం కాలేదు. తర్వాత కాలంలో సంబంధిత లీడర్ కాలం చేయడంతో ఆయన పుత్రరత్నం సంబంధిత భూమి అమ్మకాలు, సంబంధిత పోజిషన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ యేడాది జనవరి 19,20,21తేదిల్లో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ముస్లీంల బహిరంగ సదస్సు జరిగింది. ఇస్తేమగా పేరుగాంచిన సంబంధిత సదస్సుకు దేశ వ్యాప్తంగా ఉన్న ముస్లీం మతపెద్దలు హాజరయ్యారు. ఇస్తేమ సదస్సు 231 సర్వే నంబర్ లో ని చెరువు శిఖం భూమిలో జరిగింది. ఆనాడు ఇస్తేమ కోసం ప్రజల రాకపోకలకు అనుకూలంగా ఒకనాటి రెవెన్యూ శాఖ తవ్విక కందకాలను కూల్చివేసి రాకపోకలకు అనుకూలంగా చేశారు. దాదాపు రెండు నెలల తర్వాత అక్కడ తిరిగి పట్టా భూమికి సంబంధించి ఎకరం 28 గుంటల పత్రాలను ప్రాతిపదికగా మళ్ళీ శిఖం భూమి అమ్మకాలకు తెర లేపారు కాంగ్రెస్ యువనాయకుడు. తాజాగా కొందరినీ భాగస్వాములుగా చేసుకుని అక్కడ మళ్లీ ప్లాట్ల విక్రయాలు, రిజిస్ట్రేషన్లకు తెర లేపారు. తాజాగా ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విషయంలో సానుకూలంగా ఉండడంతో దానిని అనుకూలంగా చేసుకుని శిఖం భూమిని అమ్మేందుకు ప్రయత్నాలు చేపట్టాడు. ఈ విషయంపై మజ్లీస్ జిల్లా అధ్యక్షులు అహ్మద్ ఫయాజుద్దీన్, నగర అధ్యక్షులు షకీల్ హైమద్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మంగళవారం నిజామాబాద్ రూరల్ మండల తహసీల్ధార్, ల్యాండ్ సర్వే అధికారులు సంబంధిత భూమిని పరిశీలించి అది శిఖం భూమిగానే తేల్చి చెప్పారు.

