26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Must read

📰 Generate e-Paper Clip

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

నీట్ పేపర్ లీక్ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల పిలుపు మేరకు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎస్ఆర్ఎన్ కె డిగ్రీ & పీజీ కళాశాల, నర్సింగ్ కళాశాలల్లో శుక్రవారం విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ బంద్‌ను పిడిఎస్ఎఫ్, డిఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ, టిఆర్ఎస్వి, కాక్రొజ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.బాల్ రాజ్ మాట్లాడుతూ, ఇటీవల వెలుగులోకి వచ్చిన నీట్ పేపర్ లీక్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీకేజ్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు, యువత చేపట్టిన నిరసన ర్యాలీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీచార్జ్ నిర్వహించడంతో పాటు పలువురు విద్యార్థులు, యువకులు గాయపడిన ఘటనను ఆయన ఖండించారు. విద్యార్థులపై జరిగిన ఈ చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల పిలుపు మేరకు నిర్వహించిన విద్యాసంస్థల బంద్‌కు బాన్స్వాడలో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. విద్యారంగానికి తగిన నిధులు కేటాయించాలని, విద్యలో కార్పొరేటీకరణ, వ్యాపారీకరణను అరికట్టాలని, విద్యార్థులపై దాడులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించిన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు విద్యార్థి సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్, డిఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జీవన్ రాథోడ్, నాయకులు పవన్, ఎన్ఎస్యుఐ నాయకులు అర్ఫాత్, నవీన్, కాక్రొజ్ విద్యార్థి సంఘం నాయకుడు మూడ్ వినోద్, ఎస్ఎఫ్ఐ నాయకులు వెంకటేష్, శివ, నవీన్, టిఆర్ఎస్వి నాయకులు స్వరాజ్, అల్తామస్ తదితరులు పాల్గొన్నారు.

 

Shutdown of educational institutions led by student unions proves successful.

More articles

Latest article