- భగ్గుమన్న ఉపాధ్యాయ సంఘాలు
నిజామాబాద్, బతుకమ్మ : ఉమ్మడి పరీక్షల విభాగం (డీసీఈబీ) కార్యదర్శిగా మూడోసారి సీతయ్య పగ్గాలు చేపట్టారు. నగరంలోని డీఈఓ కార్యాలయంలో గల డీసీఈబీ కార్యాలయంలో ఉమ్మడి పరీక్షల విభాగం సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ అశోక్ కుమార్ డీసీఈబీ కార్యదర్శిగా సీతయ్యను నియమిస్తూ నిర్ణయం తీసకున్నారు. ఈ నిర్ణయం సమావేశానికి హాజరైన సభ్యుల అభిప్రాయాలు తీసుకోకముందే డీఈఓ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. సభ్యులకు తమ అభిప్రాయాలు చేప్పే అవకాశం ఇవ్వకుండా సభ్యులందరూ సంతకాలు పెట్టాల్సిందేనని స్వంత నిర్ణయం తీసుకోవడం పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శిగా సీతయ్య కంటే సీనియర్ జీహెచ్ఎం, సీనియర్ డీసీఈబీ సభ్యులు జె.శంకర్ దరఖాస్తు చేసుకున్నాడని, ఆయనకు అవకాశం ఇవ్వకుండా రెండు పర్యాయాలు డీసీఈబీ కార్యదర్శిగా పనిచేసిన సీతయ్యను కొనసాగించడం ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకమని, డీఈఓ తనకు నచ్చిన, మెప్పించిన వారికే డీసీఈబీ కార్యదర్శిగా నియమించడం విచారకరమని ఉపాధ్యాయ సంఘాలు తమ అభిప్రాయం వ్యక్తం చేశాయి.
