ఉత్తర్వులపై సందేహాలు
కలెక్టరేట్ ముఖ్య అధికారి కీలకపాత్ర
సీసీఎల్ ప్రొసీడింగ్ సంఖ్యతో జిల్లాలో మరో ఆర్డర్
నిజామాబాద్, బతుకమ్మ :
వడ్డించే వాళ్ళు మన వాళ్ళు ఉంటే బంతిలో ఏ మూల కూర్చున్న అందుతుందనే సామెత రెవెన్యూ వర్గాలకు సరిపోతుంది. యూనియన్ నాయకునికి పోస్టింగ్ ఇచ్చేందుకు అనుకున్న మాదిరిగా ఉత్తర్వులు జారీ చేసుకున్నారని ఉద్యోగులు సందేహిస్తున్నారు. నాయబ్ తహసిల్దార్ల నుంచి తహసిల్దారులుగా పదోన్నతి కల్పిస్తూ ఈనెల 3న సిసిఎల్ఏ నుంచి ఉత్తర్వులు (11(1)2675751/2024) అందాయి. ఇదే ప్రొసిడింగ్ సంఖ్యను జోడిస్తూ ఈ నెల 10న రెవెన్యూ నాయకుని కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు తీయడం పై రెవెన్యూ వర్గాలలో దుమారం రేపినట్లవుతోంది. యూనియన్ నాయకుని కోసం కలెక్టరేట్ ముఖ్య అధికారి చేసిన తీరుకు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఉత్తర్వులపై సందేహాలు…
మెప్మాలో డిప్యూటేషన్ పదవి కాలం గత నెల 23న ముగిసినట్లు సమాచారం. డిప్యూటేషన్ పూర్తికాగానే సిసిఎల్ఎలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారనే భయంతో అటువైపు వెళ్ళకుండా జిల్లా కలెక్టరేట్లోనే మంతనాలు జరిపినట్లు
తెలిసింది. పని ఉండకుండా, జీతం వచ్చే విధంగా స్థానికంగా పోస్టింగ్ ఉండాలని వెతికి చివరకు ఒకరిని జరిపి ఆ సీట్లో ఈనెల 10న కూర్చోబెట్టినట్లు రెవెన్యూ ఉద్యోగులకు ఆలస్యంగా తెలిసింది.
రహస్య పోస్టింగ్….
నిజామాబాద్ ఆర్ డి ఓ కార్యాలయంలో ఏవోగా ఉన్న అధికారిని రెంజల్ మండలానికి బదిలీ చేసి కోర్టు పనుల నిమిత్తం హైదరాబాద్ కు డిప్యూటేషన్ ఇచ్చినట్లు సమాచారం. సంఘ నాయకుని పోస్టింగ్ కోసమే ముందు ఉన్న అధికారిని బదిలీ చేసినప్పటికీ దీనికి సంబంధించిన ఉత్తర్వులు కనబడకపోవడం పై అనుమానాలు పొడసూపుతున్నాయి.
సీసీఎల్ఏ ప్రొసీడింగ్ పై….
నాయబ్ తహసీల్దారుల పదోన్నతి కోసం ఈ నెల 3న తీసిన ప్రొసీడింగ్ సంఖ్య (11(1)2675751/2024) ఆధారం చేసుకొని నాయకుని కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు తీసారనే చర్చ జరుగుతోంది. తాసిల్దారులుగా పదోన్నతి తీసుకున్న వారు కలెక్టరేట్లో ఈనెల 5న, 6న (జాయినింగ్ రిపోర్ట్) విధుల్లో చేరారు. వీరు చేరినట్లుగా సీసీఎల్ఏ కు పంపిన లేఖలో చివరగా జిల్లా కలెక్టర్ నోట్ ఫైల్ అప్రూవల్ అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. విషయం ప్రస్తావించకుండా కలెక్టర్ నోట్ ఫైల్ అంటూ సీసీఎల్ఏకు పంపిన దాఖలాలు లేవని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో పేరు రాస్తే పోస్టింగ్ విషయం బయటకు పొక్కుతుందనే ఉద్దేశంతోనే నోట్ ఫైల్ పేరిట తెర లేపారని రెవెన్యూ ఉద్యోగుల అనుమానానికి బలం చేకూర్చినట్లయింది. సీసీఎల్ఏ నుంచి ఈ నెల 3న వచ్చిన ప్రోసిడింగ్ సంఖ్యను జత చేస్తూ సంఘ నాయకుని కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు తీశారు. ప్రధాన కార్యాలయానికి తెలియకుండా జిల్లాలో రహస్యంగా ఇలాంటి ఉత్తర్వులు తీయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.
ముఖ్యఅధికారి కీలక పాత్ర…
కలెక్టరేట్లో ఉన్న ముఖ్య అధికారి సంఘ నాయకుని పోస్టింగ్ విషయంలో కీలక పాత్ర వహించారని ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. విధులలో చేరే వరకు అంతా రహస్యంగా ఉంచి వారు వేసుకున్న ప్రణాళిక ప్రకారం పనులు గావించారు. ఎన్నికల సమయంలోను నాలుగేళ్ళ సర్వీసును దాచి పెట్టుకోవడడంతోపాటు మరో ముగ్గురికి బదిలీ గాకుండా వెసులుబాటు కల్పించిన ఘనత ముఖ్య అధికారికి ఉంది. దీనివల్ల సీసీఎల్ఏకు అనుమానం రాకుండా అక్కడ నుంచి ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రొసీడింగ్ సంఖ్యను జతచేస్తూ జిల్లాలో కలెక్టర్ పోస్టింగ్ జారీ చేసేలా పన్నాగాలు పన్నారు.
