రామారెడ్డి, బతుకమ్మ :
వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఇలు సింగ్ మేరు స్కూల్ తాండ అటవి ప్రాంతంలో పర్యటించారు. ఇటివల రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామం స్కూల్ తాండా అటవి ప్రాంతంలో పెద్ద పులి అవును చంపి వేసిన విషయం తెలిసిందే. మహరాష్ట్రలోని టైగర్ రిజర్వ్ ప్రాంతం ( తడోబా) నుంచి తప్పి పోయి వచ్చిన పులి కోసం ఆటవి శాఖాధికారులు గాలిస్తున్న విషయం విధితమే. అయితే స్కూల్ తాండా పరిధిలో పులిని వేటాడే యత్నం చేయడంతో అధికారులు రిస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు పులి ఆచూకీ కోసం మూడు టీంలను ఏర్పాటు చేసి ట్రాక్ కెమెరా ల ద్వార పులిని గుర్తించే పనిలో పడ్డారు .
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్( వైల్డ్ లైఫ్) ఇలు సింగ్ మేరు శుక్రవారం స్కూల్ తాండా ప్రాంతంలో పర్యటించారు. యానిమల్ ట్రాకింగ్ సిబ్బందితో మాట్లాడారు. ట్రాక్ కెమేరాల పని తీరును పరిశీలించారు. ఇటివల కాలంలో కామారెడ్డి జిల్లాలో పెద్ధ పులి కదలికలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు వారీగా పులి కదలికల వివరాలను పంపించాలని తద్వార ఇతర ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసే అవకాశం ఉందన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వనమహోత్సవం కార్యక్రమంలో వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ ఇలు సింగ్ మేరు పాల్గొని మొక్కలు నాటారు. ఆయన వెంట జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ రామకృష్ణ, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఉన్నారు.

