నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ తీరు మెరుగుపడేలా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం అన్ని మండలాల ఎంఈవోలతో విద్యా శాఖ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. నాణ్యతతో కూడిన విద్యను బోధిస్తూ, ఫలితాలు మెరుగుపడేలా చూడాలన్నారు. ప్రత్యేకించి పదవ తరగతిలో ఉత్తీర్ణత మెరుగుపడాలన్నారు. పాఠశాలల్లో మంజూరయ్యే అభివృద్ధి, మరమ్మతు పనులకు సంబంధించిన పూర్తి వివరాలు ఎంఈవోలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలిసి ఉండాలన్నారు. ఏయే పనులకు ఎన్ని నిధులు కేటాయించబడ్డాయి, పనులు చేపట్టాల్సిన ఏజెన్సీ గురించి వివరాలు సేకరించి పనులు సకాలంలో చేపట్టేలా చొరవ చూపాలన్నారు. ఆయా పాఠశాలల్లో పెండింగ్ లో ఉండిపోయిన పనులను వెంటనే పూర్తి చేయించాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యానికి తావులేకుండా, విద్యార్థులకు నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీల నిర్వాహకులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలన్నారు. యూడైస్ లో వివరాలను నమోదు చేయడంతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును ఎఫ్.ఆర్.ఎస్ పధ్ధతిన శత శాతం అమలు చేయాలని సూచించారు. లైబ్రరీ, కిచెన్ గార్డెన్ వంటి వాటిని ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.. విద్యుత్ సదుపాయం, కంప్యూటర్ల మరమ్మతులు వంటి అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. ప్రభుత్వ బడులతో పాటు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లోనూ అందరు విద్యార్థులకు సంబంధించి అపార్ జెనరేట్ అయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఓపెన్ స్కూల్స్ లో ప్రవేశాలు గణనీయంగా చేపట్టారని, అదే స్పూర్తితో పాఠశాలల్లో కూడా పూర్తి స్థాయిలో అడ్మిషన్స్ జరిగేలా కృషి చేయాలన్నారు. ఈ సంవత్సరం తక్కువ మొత్తం ప్రవేశాలు జరిగిన పాఠశాలల్లో కనీసం వచ్చే విద్యా సంవత్సరంలో లక్ష్యానికి మించి అడ్మిషన్స్ జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ఉద్దేశించిన భవిత కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించేలా పర్యవేక్షణ జరపాలన్నారు. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ, నాణ్యమైన విద్యా బోధన అందించేలా కృషి చేయాలన్నారు. ఎక్కడైనా లోపాలు నెలకొని ఉంటే, వాటిని సవరించుకుని జిల్లాలోని అన్ని పాఠశాలల నిర్వహణ మెరుగుపడేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, డీ.ఐ.ఈ.ఓ రవికుమార్, డీ.ఈ.ఓ అశోక్, అన్ని మండలాల ఎం.ఈ.ఓలు, కాంప్లెక్స్ పాఠశాలల హెచ్.ఎంలు పాల్గొన్నారు.

