25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కలెక్టరేట్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు 

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.

Savitribai Phule Jayanti celebrated in the Collectorate

అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి, సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా చైతన్యానికి బాటలు వేశారని, తద్వారా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారని అన్నారు. అస్పృశ్యత, అంటరానితనం, కులవివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి ఆధిపత్య వర్గాల సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, వాటిని లెక్కచేయకుండా మహిళల విద్యాభివృద్ధికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. ఆ మహనీయురాలి స్పూర్తితో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, అప్పుడే ఆమె ఆశయ సాధనకు కృషి చేసినట్లు అవుతుందని అన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇకనుండి ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రతియేటా జనవరి 3 వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయినులుగా ఎంపికైన సాలూర ఎం.ఈ.ఓ మంజూష, వేల్పూర్ ఎం.ఈ.ఓ రేణుక, సుద్దపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల పీ.డీ సంధ్యారాణి, నాగారం ఉర్దూ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన హలీమా బేగం, బాల్కొండలోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాల ఉపాధ్యాయిని ఎల్.ఉమాదేవి, జూనియర్ లెక్చరర్ నూరున్నీసా బేగం, జాతీయ గ్రహీత విజయలక్ష్మి, రాష్ట్రస్థాయిలో అవార్డు పొందిన ఏ.స్వరూపలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ మధు, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Savitribai Phule Jayanti celebrated in the Collectorate

More articles

Latest article