- చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎన్సీఎస్ఎఫ్ సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. కోటగల్లి ఎన్ఆర్ భవన్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పసుపు బోర్డు ఆఫీసు ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కి ఎన్సీఎస్ఎఫ్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని రూరల్ శాసనసభ్యులు ఆర్.భూపతి రెడ్డి వినతిపత్రం అందజేశారని తెలిపారు. రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎన్సీఎస్ఎఫ్ తెరిపించి, బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడిపించాలని డిమాండ్ చేశారు. గతం లో 122 గ్రామాలలో, 22,300 రైతులు సభ్యులుగా ఉండి, ఫ్యాక్టరికి 6 వేల మంది రైతులు చెరుకు సప్లై చేసేవారని అన్నారు. గతంలో మంచి లాభాలతో నడిచిన ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆనాటి పాలకుల తప్పుడు విధానాలు, అవినీతి అధికారుల అలసత్వం వల్ల మూతపడిందని అన్నారు. నేటికీ పంట మార్పిడిలో భాగంగా రైతులు చెరుకు పండించేందుకు సిద్ధంగా ఉన్నారని, ముందుగా ఫ్యాక్టరీ తెరిపిస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు నమ్మకం కలిగించే విదంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు కొట్టె గంగాధర్, మురళి తదితరులు పాల్గొన్నారు.
