27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

వినియోగదారులకు నేరుగా ఇసుక అందుతుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బోధన్ సబ్‌ కలెక్టర్ వికాస్ మహా

 

బోధన్, బతుకమ్మ :

 

మన ఇసుక వాహనంయాప్ ద్వారా ఇసుక బుకింగ్ చేస్తే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వినియోగదారులకు నేరుగా, పారదర్శకంగా ఇసుక అందుతుందని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహ అన్నారు. సాలురా తహసీల్దార్ కార్యాలయం, బోధన్ వీసీ హాల్‌లో ఎం.ఐ.వి (మన ఇసుక వాహనం) పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన ఇసుక రవాణా ప్రయాణాల వివరాలను పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా రిజిస్టర్లలో నమోదు చేయాలని ఆదేశించారు. దీనివల్ల అక్రమ ఇసుక తరలింపును అరికట్టవచ్చని పేర్కొన్నారు. ఇసుక బుకింగ్ ఇకపై పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే జరగాలని, మ్యానువల్ పద్ధతికి స్వస్తి పలికినట్లు తెలిపారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా నిజామాబాద్ జిల్లాలో అమలు చేస్తున్నందున పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక కేటాయిస్తామని వెల్లడించారు. విలేజ్ ఫండ్ కింద ట్రాక్టర్ ఇసుక లోడ్‌కు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు కేవలం రూ.612 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, ఇతర గృహ నిర్మాణాలు, ప్రభుత్వ పనులకు రూ.1173 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. చెల్లింపులు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లోనే చేయాలని సూచించారు. ఇసుక తరలింపుకు వినియోగదారులే ట్రాక్టర్‌ను సమకూర్చుకోవాలని, టిప్పర్లు, లారీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇసుక రీచ్‌లలో జేసీబీలు, డోజర్లు వినియోగించకుండా కూలీల ద్వారానే నిర్ణీత పరిమాణంలో లోడింగ్ చేయాలని ఆదేశించారు. స్మార్ట్ ఫోన్ ఉన్నవారు ప్లే స్టోర్ నుంచి మన ఇసుక వాహనంయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని నేరుగా బుకింగ్ చేసుకోవచ్చని, ఫోన్ లేని వారు పంచాయతీ కార్యదర్శుల ద్వారా బుకింగ్ చేయించుకోవచ్చని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యానువల్ రసీదులు, అనుమతులు జారీ చేయరాదని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సాలురా తహసీల్దార్ శశిభూషణ్, బోధన్ తహసీల్దార్ విటల్, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, బోధన్ మున్సిపల్ వార్డు అధికారులు పాల్గొన్నారు.

 

Sand will be delivered directly to consumers.
Sand will be delivered directly to consumers.

More articles

Latest article