30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా

Must read

📰 Generate e-Paper Clip

  • ఇందిరమ్మ ఇంటికి రెండు ట్రిప్పులు.. బయటికి నాలుగు ట్రిప్పులు
  • మూడు పువ్వులు ఆరు కాయలుగా ఇసుక అక్రమ దందా

 

బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అభాసుపాలవుతోంది. బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుక విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో  మద్నూర్, జుక్కల్, పిట్లం మండలాలతో పాటు బిచ్కుంద మండలానికి సుమారు 2500లఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు ఇచ్చిన అనుమతితో బిచ్కుంద మండల వ్యాప్తంగా పట్టపగలు ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. దీంతో ఇసుక వ్యాపారులకు ఇందిరమ్మ ఇళ్లు కాసులు కురిపిస్తున్నాయి. అడ్డగోలు సంపాదనకు మార్గం సుగమం చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇసుకాసురుల జేబులు నింపుతోంది. ఇసుక రవాణాకు రాచ మార్గం దొరికిందన్న సంతోషంలో రెట్టింపు సంపాదిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక పర్మిషన్ ఇవ్వడంతో ట్రాక్టర్ యజమానులకు రెక్కలు వచ్చాయి. ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. పర్మిషన్ ఉంటే చాలు, రాత్రి పగలు తేడా లేకుండా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం పర్మిషన్ ఇచ్చి చేతులు దులుపుకోవడంతో ఇసుక రవాణా చేసే వారికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని ప్రజలు అంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయానికే కాదు లబ్ధిదారుల ఆశల కు ఇసుక వ్యాపారులు గండి కొడుతున్నారనే విమర్శలున్నాయి.

  • పేరుకే అనుమతులు..

ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం  మండల రెవెన్యూ సిబ్బంది లబ్ధిదారులు తీసుకొచ్చిన ట్రాక్టర్లకు రోజుకు 2 నుంచి 4 టిప్పుల ఇసుకకు పర్మి షన్ ఇస్తున్నారు. కానీ ట్రాక్టర్ యజమానులు మాత్రం కేవలం ఒక ట్రాక్టర్కు మాత్రమే కూపన్ తీసుకొని ఐదు ట్రాక్టర్ల వరకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు సమయాన్ని కేటాయిస్తూ పర్మిషన్ ఇస్తున్నారు. కానీ, ట్రాక్టర్ల యజమానులు మాత్రం ఇచ్చిన కూపన్‌ను దగ్గర పెట్టుకొని నాలుగు, ఐదు ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఉదయం 10 గంటల తర్వాతనే వెళ్లాలని, సాయంత్రం 5 గంటల తర్వాత ఇసుక తీయరాదనే నిబంధన ఉన్నా ట్రాక్టర్ల యజమానులు ప్రతి రోజూ తెల్లవారు జాము నుంచే తరలిస్తున్నట్టు తెలుస్తున్నది. ట్రాక్టర్ యజమానులు నిబంధనలను తుంగలో తొక్కి రాత్రి వరకు ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

  • అధికారుల నిఘా కరువు..

జుక్కల్ నియోజకవర్గంలోనీ నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలల్లో ఉన్న మంజీరా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇతర మండలాలకు ఇసుక తరలిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని ప్రజలు అంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం పర్మిషన్ తీసుకొని ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు, పోలీసు పట్టించుకోవడంలేదని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. వర్షాలు పడితే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడం కోసం ఇసుక కూడా దొరకదని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • అంతా అధికార పార్టీ నాయకులేనా ?

బిచ్కుంద మండలవ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాను అధికార పార్టీ నాయకులే పెంచి పోషిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో ఒక్కో ట్రాక్టర్ రూ. 5 వేలకు ధర పలుకుతుండడంతో అధికార పార్టీకి చెందిన కొంత మంది బడా, చోటా మోటా నాయకులంతా అక్కడ ఇసుక మాఫియా పైనే దృష్టి సారించారు. దీంతో ఈ అక్రమ ఇసుక వ్యాపారం 3 ట్రాక్టర్లు 30 ట్రిప్పులుగా సాగుతుందని ఆరోపణలున్నాయి.

  • ఇష్టారాజ్యంగా తరలింపు..

బిచ్కుంద రెవెన్యూ సిబ్బంది ఇస్తున్న కూపన్లను పట్టుకొని ట్రాక్టర్ల యజమానులు పెద్ద మొత్తంలో ఇసుక దందాకు తెరలేపినట్టు తెలుస్తోంది. ట్రాక్టర్‌కు ఒక కూపన్‌ మాత్రమే రెవిన్యూ సిబ్బంది ఇస్తున్నారు. సంబంధిత అధికారుల సిబ్బంది ఇంకా ట్రాక్టర్ల వద్దకు రాకముందే యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. సిబ్బంది వచ్చిన తర్వాత తీసుకెళ్లే ఇసుకకు మాత్రం కూపన్లు చూపిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని క్వారీల్లో ట్రాక్టర్‌ వెంట లబ్ధిదారులు కూడా రావాలని అధికారులు నిబంధన పెట్టుకున్నారు. కానీ, లబ్ధిదారులు రాకున్నా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. ఇంటి నిర్మాణం బేస్‌మెంట్‌ స్థాయిలో ఉంటే రెండు ట్రిప్పులకు కూపన్లు తీసుకొని వాటిని దగ్గర పెట్టుకొని నాలుగు, ఐదు ట్రిప్పులు తీసుకెళ్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఒక కూపన్‌ ఒక ట్రిప్పునకు మాత్రమే వాడుకోవాల్సి ఉండగా అనేక ట్రిప్పులు జార వేయడం విమర్శలకు తావిస్తోంది. పర్యవేక్షణ లోపమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుంది.

  • ట్రాక్టర్కు రూ. 5 వేలు..

బిచ్కుంద మండలంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే వారికి దగ్గరలో ఉన్న  మంజీరా నది పరిధిలోని బిచ్కుందో రెవిన్యూ కార్యాలయం నుంచి పర్మిషన్ తీసుకుంటే రూ. 2500లకు ట్రాక్టర్ ఇసుక విక్రయించాలి. ఇదే అదునుగా తీసుకున్న ట్రాక్టర్ యజమానులు పర్మిషన్లను సాకుగా చూపుతూ ఇందిరమ్మ లబ్ధిదారులకు కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో రూ.5 వేల చొప్పున అమ్ముకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.2500 రూపాయలు అదనంగా రావడంతో ట్రాక్టర్ యజమానులు బయట మార్కెట్లో విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంతటి అక్రమ ఇసుక రవాణాపై ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Sand smuggling in the name of Indiramma's houses

More articles

Latest article