- తవ్వేది వారే.. కొనుగోలు చేసేది వారే
- మంజీరాలో రాత్రి వేళ కొనసాగుతున్న తవ్వకాలు
- రాత్రి వేళ తవ్వకాలలో పట్టుబడని వాహనాలు, యంత్రాలు
- సరిహద్దు ప్రాంతాలలో డంప్ చేస్తున్న ఇసుకాసురులు
- పట్టుబడిన ఇసుకను అధికారికంగా వేలంలో దక్కించుకుని తరలింపు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వర ప్రధాయని నిజాంసాగర్ (మంజీరా నది) పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ప్రవహిస్తున్న మంజీర పరివాహక ప్రాంతంలో ప్రజల అవసరాల పేరిట ఇసుకను తవ్వేస్తున్నారు. గత సీజన్ లో కామారెడ్డిలో ఇసుక రీచ్ లకు అనుమతులు ఇవ్వగా అక్కడ వాటిని మూసివేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో పూర్వపు బోధన్ మండలంలో మాత్రమే తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. దానికి ప్రభుత్వ రుసుం చెల్లించిన వారికి వే బిల్లులు జారీ చేస్తుండటంతో ఇసుకను తవ్వి తరలించాడానికి అనుమతులు ఇచ్చారు. అవి కుడా ఇసుక ట్రాక్టర్ లలో స్థానిక అవసరాల పేరిట అనుమతులు ఇస్తున్నారు. కాని భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి పరిమితులకు మించి రవాణా చేస్తున్నారు. రాత్రికి రాత్రి తరలించడం వీలు కాకపోతే నది ఒడ్డున ఉన్న గ్రామ శివారులలో డంప్ చేసి తరలించే దందా ఉమ్మడి జిల్లాలో జరుగుతుంది. డంప్ లలో ఇసుకను పట్టపగలు తరలించడం, పట్టుబడితే దానిని వేలంలో దక్కించుకుని అమ్మకాలు చేసే దందా జరుగుతుంది.

కామారెడ్డి జిల్లా బిచ్కుంధ, బీర్కూర్ మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. దానితో రాత్రి వేళ తవ్వకాలను కొనసాగిస్తున్నారు. స్థానిక అవసరాలకు తహసీల్దార్ ద్వార జారీ అయ్యే వే బిల్లుల ద్వార ఇసుకను తవ్వేస్తున్నారు. ఒక్క బిల్లు మీదా నాలుగైదు ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రేండ్ కామారెడ్డి జిల్లాలోని రెండు మండలాల్లో జరుగుతుంది. స్థానికంగా నది శివారు ప్రాంతాలలో ఇసుకను డంప్ చేస్తున్నారు. అధికారులు గుర్తించి వేలం వేసిన వాటిని తామే వేలంలో దక్కించుకుని అదే ఇసుకను టిప్పర్ లలో ఏకంగా సరిహద్ధులను దాటిస్తున్నారు. ఇసుక రీచ్ ల మాదిరిగా ఇసుక డంప్ లు ఉన్న చర్యలు తీసుకోలేదు అనే ఫిర్యాదులు ఉన్నాయి. రెవెన్యూ శాఖ, ఆర్టీవో శాఖ, పోలీస్ శాఖ ఇసుక మాఫియాతో చేతులు కలిపి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా మంజీరా నది నుంచి తరలిస్తున్నారు. ప్రధానంగా కొంతమంది అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పి అక్రమ ఇసుక దందా కు పాల్పడుతుంటే, మరికొందరు విలేకరుల ముసుగులో అక్రమ ఇసుక దందా కొనసాగిస్తున్నారని రైతులు నేరుగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతకు ఫిర్యాదు చేయడంతో ఆయన రాత్రి అని లెక్కచేయకుండా కొడిచెర్ల మంజీరా నది పర్యాయక ప్రాంతాన్ని పరిశీలించారు.
బాన్సువాడ, బీర్కూర్, మద్నూర్, డోంగ్లి, కోటగిరి, పొతంగల్ మండలాల్లో విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ ఇసుక దందా అరికట్టడానికి బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహత ఏర్పాటు చేసిన తనిఖీ బృందాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ బృందాలు ఎవరికి సమాచారం ఇవ్వకుండా రాత్రి వేళలో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐతే జేసిబిలు, ట్రాక్టర్ లు, టిప్పర్లు మాత్రం పట్టుబడటం లేదు. అందుకు అనుమానాలు వ్యక్తం మౌతున్నాయి. ఇప్పడు నది గర్భంలో ఇసుక తవ్వకాలు రాత్రిళ్లు జరుగడం, ఇసుకను డంప్ చేయడం పట్టుబడటంతో వేలంలో దక్కించుకునే దందా నిరాటంకంగా జరుగుతుంది.

