. ఏసీబీ దాడులు చేసినా తీరు మారని వైనం
. యథేచ్ఛగా దళారుల దందా
. దుకాణాలు ఓపెన్ చేసిన ఏజెంట్లు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: ఏసీబీ అధికారుల సోదాల తరువాత జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో పరిస్థితి మారుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. కార్యాలయం ఎదుటే ఉండే ఏజెంట్లు తమ దుకాణాలను మళ్లీ తెరిచి వసూళ్లకు తెరలేపారు.
ఏ పని కావాలన్నా అధికారులు ఏజెంట్ల వైపు చూపిస్తుండడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న వారు ‘ఇక మీరు మారరు’ అంటూ గొణుక్కుంటూనే చేసేది లేక ఏజెంట్ల వద్దకు వెళ్తున్నారు. దరఖాస్తులు స్వీకరిస్తున్న ఏజెంట్లు ఏ పనికి ఎంతో నిర్ణయిస్తూ పని చేయించేందుకు కార్యాలయంలోకి యథేచ్ఛగా వెళ్తున్నారు. ఈనెల 12వ తేదీన ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తోపాటు సిబ్బంది జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు.
కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు ముందుగా మెయిన్ గేట్ కు తాళం వేసి ఎక్కడి వారు అక్కడే ఉండిపోయేలా ఆదేశించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెంట్ ఖలీమ్ వద్ద ఉన్న 14 ఆర్ సీలు, డ్రైవింగ్ లైసెన్సులతోపాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్యాలయంలోని పలు దరఖాస్తులపై ప్రత్యేక కోడింగ్ ను గుర్తించారు. ఆ కోడ్ వసూళ్లకు సంబంధించినదని ఏసీబీ అధికారులు నిర్దారణకు వచ్చినప్పటికీ సరైన ఆధారాలు లభించలేదని సమాచారం. మొత్తానికి రవాణాశాఖ కార్యాలయంలో ఏజెంట్లదే రాజ్యమేలుతున్నారని, సంబంధిత అధికారులు వారినే ముందుంచుతున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు.
ఏసీబీ సోదాల తరువాత నిబంధనలు కచ్చితంగా అమలవుతాయని అంతా ఆశించారు. కానీ కార్యాలయంలోకి ఎవరు పడితే వారు ఏ మాత్రం అడ్డు లేకుండా వెళ్తున్నారు. హెల్మెట్ లేని వారికి లోనికి ప్రవేశం లేదని గేటుపై స్పష్టంగా రాసి ఉన్నా దాన్ని ఎవరూ ఖాతరు చేయడం లేదంటే ఇంకా కార్యాలయం లోపల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ఏజెంట్ చేతిలో పదుల సంఖ్యలో దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్నా వారిని ప్రశ్నించే వారు ఎవరూ లేరు.
కార్యాలయానికి కిలోమీటరు లోపల ఏజెంట్లు కనిపించొద్దని స్పష్టమైన నిబంధన ఉన్నప్పటికీ ఆర్టీఏ కార్యాలయం గేటు ఎదుటే దుకాణాలను ఏర్పాటుచేసుకున్నారు. ఏసీబీ సోదాల సందర్భంగా తమ దుకాణాలను మూసివేసిన ఏజెంట్లు ప్రస్తుతం యథాతథంగా నడిపిస్తున్నారు.
