24 C
Hyderabad

మాధవ్ నగర్ ఆర్‌ఓబీకి రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి

Revised administrative sanction for Madhav Nagar ROB at a cost of Rs 101.80 crore

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అదనపు నిధుల మంజూరుకు నిరంతర పోరాటం ఫలించింది

 

. . .  ఎంపీ ధర్మపురి అర్వింద్

 

నిజామాబాద్ , బతుకమ్మ :

 

నిజామాబాద్ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిచ్‌పల్లి–నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నంబర్ 193 వద్ద నాలుగు వరుసల ఆర్‌ఓబీ నిర్మాణానికి రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ నవంబర్ 2, 2026న జీవో.ఆర్.టి.నంబర్.568 జారీ చేసింది. గతంలో రూ.93.12 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని రూ.101.80 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అదనపు నిధుల అనుమతులకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత రెండేళ్లుగా అదనపు నిధుల మంజూరు, సవరించిన అంచనాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో నిర్మాణ పనులు ఆశించిన వేగంతో ముందుకు సాగలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ ధర్మపురి అర్వింద్ పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు విజ్ఞప్తులు చేశారు. గతంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కూడా కలిసి అదనపు నిధుల అవసరాన్ని వివరించారు.వెంటనే స్పందించిన కోమటిరెడ్డి ఫైల్ ని క్లియర్ చేసి ఆర్థిక శాఖకి పంపారు. ఆర్థిక శాఖలో రెండేళ్లుగా ఫైల్ క్లియర్ కాకపోవడంతో ప్రజల ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు అక్టోబర్ 27న మాధవ్ నగర్ ఆర్‌ఓబీ వద్ద ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్‌ఓబీ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ ఎంపీ స్వయంగా భిక్షాటన కార్యక్రమం చేపట్టి ప్రజలు, నాయకులు, వాహనదారుల నుంచి విరాళాలు సేకరించారు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ప్రజాప్రతినిధిగా తాను ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమనే సందేశాన్ని ఈ వినూత్న నిరసన ద్వారా తెలియజేశారు. అనంతరం అక్టోబర్ 29న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి మాధవ్ నగర్ ఆర్‌ఓబీకి సంబంధించిన రూ.8.68 కోట్ల అదనపు నిధులకు ఆర్థిక, పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని ఎంపీ అర్వింద్ విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఎంపీ తెలిపారు.అక్టోబర్ 31న నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో కూడా మాధవ్ నగర్, అర్సపల్లి ఆర్‌ఓబీ నిర్మాణాల పురోగతిని ఎంపీ సమీక్షించారు. పనుల్లో జరుగుతున్న జాప్యంపై అధికారులను ప్రశ్నిస్తూ, నిర్దేశిత మైలురాళ్ల ప్రకారం పనులు వేగవంతం చేసి రానున్న నాలుగైదు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ వరుస ప్రయత్నాలు, రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు, ప్రజా నిరసనల నేపథ్యంలో నవంబర్ 2న ప్రభుత్వం సవరించిన పరిపాలనా అనుమతులు జారీ చేయడం సంతోషకరమైన పరిణామమని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు. దీనికి సహకరించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎంపీ అర్వింద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

. . . ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతర కృషి

మాధవ్ నగర్ ఆర్‌ఓబీ పూర్తయితే నిజామాబాద్ నగరంతో పాటు డిచ్‌పల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర వైద్య సేవల కోసం ప్రయాణించే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుందని ఎంపీ తెలిపారు. ప్రభుత్వం సవరించిన అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు ఇకపై ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని, నిర్ణీత గడువులోగా ఆర్‌ఓబీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు.

More articles

Latest article