. . . 33 జిల్లాల పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్ ల నియామకం
. . . నిజామాబాద్ జిల్లాకు యోగితారాణా
. . . కామారెడ్డికి విజేంద్ర
నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముందు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై పరిశీలనకు ప్రత్యేక అధికారులను నియమించింది. జూన్ 2 నాటికి వంద రోజుల ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలు, వార్డు సభలు, మండలం, నియోజకవర్గ, జిల్లా స్థాయి కార్యక్రమాల నిర్వాహణ జరిగిన విషయం తెల్సిందే. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను ఈ కార్యక్రమంలో చేరుకున్నారా లేదా అని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫిర్యాదుల స్వీకరణ యాక్షన్ ప్లాన్ పర్యవేక్షణకు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేస్తూ నిర్వాహణకు ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్ లను నియమించారు. సంబంధిత ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సాధించిన విజయాలు, చేయాల్సిన పనులు మొదలైన వాటిని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రత్యేకాధికారులను నియమించారు.రాష్ట్రంలోని 33 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్ లను నియమించారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరిని మొదలుకుని సీనియర్ ఐఏఎస్ ల వరకు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. చీఫ్ సెక్రటరిలను మొదలుకుని జాయింట్ సెక్రటరిల వరకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యా యి. నిజామాబాద్ జిల్లాకు విద్యాశాఖ చీఫ్ సెక్రటరి డా.యోగితారాణాను నియమించారు. కామారెడ్డి జిల్లాకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి బి.విజేంద్రను నియమించారు. రాష్ట్రంలోని అన్నీ జిల్లాలో సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని ఒక డివిజన్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండానే బిల్లులు పెట్టిన వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత డివిజన్ లో ఒక ఎంపీడీవో తాను ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కోసం రెండు లక్షలు ఖర్చు చేశామని, బిల్లులు పంపినా ఇప్పటి వరకు అవి మంజూరు కాలేదని సమాచారం. కానీ మరో 8 లక్షలు మాత్రం ఎలాంటి మండలం మొదలుకుని నియోజకవర్గ స్థాయి సమావేశాలకు నిధులు వినియోగించకున్నా సంబంధిత బిల్లులను తయారు చేసి పంపడం చర్చకు దారితీసింది. పంచాయితీ స్థాయిలో మొదలైన ఈ వ్యవహరం డివిజన్ స్థాయి వరకు జరుగడం గమనార్హం. ఈ విషయంలో ఒక అధికారిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఒక ఎంపీడీవో తన మండలంలో జరిగిన ఖర్చు విషయంలో బిల్లులు పంపినా వాటిని మంజూరు చేయని అధికారులు ఎలాంటి పనులు చేయకున్నా చేసినట్లు తయారు చేసిన బిల్లుకు మంజూరు ఎలా జరిగిందని సంబంధిత శాఖలో చర్చ జరుగుతుంది. ఈ విషయంపై సంబంధిత డివిజనల్ స్థాయి అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు స్పందించకపోవడం విశేషం. ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కోసం ప్రత్యేకాధికారులుగా సీనియర్ ఐఏఎస్ లను నియమించడంతో ఈ వ్యవహరం బయటకు వస్తుందా అనే చర్చ మొదలైంది. నిజామాబాద్ డివిజన్ లో మూడు డివిజన్లు ఉండగా ఒక డివిజన్లో జరిగిన పైపైన పనులు దానికి బిల్లుల మంజూరు వ్యవహరాన్ని బహిర్గతం అవుతుందా? అవినీతి బట్టబయలవుతందా? అని సంశయాలు వ్యక్తమౌతున్నాయి.

