కమ్మర్ పల్లి, బతుకమ్మ :
కమ్మర్ పల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవలే రాజేశ్వర్ కొనసముందర్ లోని పీఏసీఎస్ లో పని చేసి పదవి విరమణ పొందారు. బుధవారం రాజేశ్వర్ పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా గురువారం చికిత్స పొందుతూ మరణించారు. అయితే తన తండ్రి రాజేశ్వర్ మరణానికి పీఏసీఎస్ సీఈవో కార్తీక్ కారణమని కుమారుడు నాగరాజు కమ్మర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పీఏసీఎస్ కొనసముంధర్ సొసైటీలో తన తండ్రి గణపురం రాజేశ్వర్ 40 సంవత్సరాలుగా పని చేసి ఇటీవలే పదవి విరమణ పొందినట్లు తెలిపారు. అయితే పీఎఫ్ డబ్బులను అక్కడ పని చేస్తున్న సీఈవో కార్తీక్ కట్టకుండా మానసికంగా వేదించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తండ్రికి మరణానికి కారణమైన సీఈవో కార్తీక్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
