- కోటరీని సిద్ధం చేసుకుంటున్న వైద్యారోగ్యశాఖ అధికారులు
- ఆగమేఘాల మీద ఏవో బాధ్యతల మార్పు
- డీడీవో పోస్టులో అవినీతి అధికారిని కూర్చోబెట్టే ప్రయత్నాలు
నిజామాబాద్, బతుకమ్మ: శాఖలో తమ వారుంటే తమకేమీ ఇబ్బందులు ఉండవని భావించిన జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఆ మేరకు పావులు కదుపుతున్నారు. తమ కోటరీని సిద్ధం చేసుకునే పనిలోపడ్డారు. కార్యాలయంలో పనిచేసే వారి వివరాలను గోప్యం ఉంచుతూ తాము అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో ఇటీవల పరిపాలన విభాగం ఇన్ చార్జి బాధ్యతలను మరొకరికి కేటాయించారు. అధికారులు ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఓ ముగ్గురు అధికారులు శాఖ ఉన్నతాధికారికి దగ్గరగా ఉంటూ తమ వారిని కీలక పోస్టుల్లో కూర్చోబెట్టుకుంటున్నారు. సాఫీగా కొనసాగుతున్న పరిపాలన విభాగంలో వేలుపెట్టిన ఆ ముగ్గురు ఉన్నట్టుండి ఏవో స్థాయి అధికారులను మార్పించేశారు. ఏవో బాధ్యతలు తీసుకున్న వ్యక్తి గతంలో సస్పెన్షన్ కు గురికావడంతోపాటు అనేక ఆరోపణలున్నాయి. రెండేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించడం శాఖలో చర్చనీయాంశమైంది. ఇదంతా ఉన్నతాధికారికి తెలియకుండా ఆ ముగ్గురు నాయకులు చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే ఎంతో కీలకమైన డీడీవో పోస్టు కొన్నేళ్లుగా ఖాళీగా ఉండగా భర్తీ చేయాలని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకునే వారు లేరు. డీడీవో పోస్టులో సైతం తమ వ్యక్తిని కూర్చోబెట్టాలని ముగ్గురు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సదరు వ్యక్తి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఆయనను డీడీవో పోస్టులో కూర్చోబెట్టేందుకు అర్హుడైన అధికారిని రాకుండా చేస్తున్నారని శాఖ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గతంలో లైంగిక వేధింపుల వ్యవహారంలో ఫిర్యాదులు రావడంతో సస్పెన్షన్ గురైన ఓ వ్యక్తి పోస్టుల కేటాయింపులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల వ్యవహారంపై జిల్లా అధికారి సరైన విచారణ చేపట్టాలని, పరిపాలన విభాగాన్ని ప్రక్షాళన చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.