నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజులు కట్టాలని విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నమోర్తాడ్ మండలంలోని కృష్ణవేణి, సంస్కృతి స్కూళ్ల పై చర్యలు తీసుకోవాలని శనివారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిజామాబాద్ విద్యాశాఖాధికారి పి.అశోక్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్ మాట్లాడారు. కృష్ణవేణి,సంస్కృతి స్కూల్స్ కమర్షియల్ బిల్డింగ్ లో తరగతులు నిర్వహిస్తున్నారని, కనీస సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థుల నుండి వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని అన్నారు. ఫీజుల కోసం రకరకాల యూనిట్ టెస్ట్ ల పేర్లతో విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని, సీట్ల పరిమితికి మించి బస్సులలో విద్యార్థులను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ సేఫ్టీ లేకుండా సేఫ్టీ గ్రిల్స్ లేకుండా ఇలా అనేక నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా నాయకులు నిఖిల్, విజయ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.